Share News

After such a long time... ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:55 PM

After such a long time... రాజాం మున్సిపాలిటీకి కొత్త రోజులు రానున్నాయి. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో పురవాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. న్యాయ చిక్కుముడులు వీడాయి. ఇక రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటే రాజాంకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేశారు.

After such a long time... ఎన్నాళ్లకెన్నాళ్లకు..

ఎన్నాళ్లకెన్నాళ్లకు..

రాజాం మున్సిపాలిటీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

విలీన వివాద పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

ఆరు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వానికి ఆదేశాలు

21 ఏళ్ల అధికారుల పాలనకు చరమగీతం

రాజాం మున్సిపాలిటీకి కొత్త రోజులు రానున్నాయి. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆ కేసులను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. దీంతో పురవాసుల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. న్యాయ చిక్కుముడులు వీడాయి. ఇక రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటే రాజాంకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి. కోర్టు కేసులతో సంబంధం లేకుండా ఇప్పటికే అధికారులు సన్నాహాలు చేశారు.

రాజాం/రూరల్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాల్టీ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయాయి. న్యాయపరమైన చిక్కులు వీడాయి. విలీన పంచాయతీల వివాదంపై దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆరు నెలలలోగా రాజాం మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. దీంతో రెండు దశాబ్దాలుగా మున్సిపల్‌ చైర్మన్‌ గిరీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఊరట లభించింది. కొత్త పాలన కోసం ఎదురుచూస్తున్న ప్రజలు కూడా తాజా పరిణామాన్ని స్వాగతిస్తున్నారు.

రెండు దశాబ్దాల క్రితం..

2005 అక్టోబరులో రాజాం నగర పంచాయతీగా ఆవిర్భవించింది. రాజాం, సారధి మేజర్‌ పంచాయతీలతో పాటు మండలంలోని కొండంపేట, కొత్తవలస పంచాయతీలు, సంతకవిటి మండలం పొనుగుటివలస పంచాయతీని విలీనం చేస్తూ రాజాం నగర పంచాయతీగా రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది. అప్పటికి సర్పంచిల పదవీకాలం ఇంకా ఏడాది గడువు ఉంది. దీంతో వారు విలీనాన్ని వ్యతిరేకించారు. తమ అనుమతి లేకుండా పంచాయతీలను రాజాం నగర పంచాయతీలో విలీనం చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొత్తవలస, కొండంపేట, పొనుగుటివలస పంచాయతీల సర్పంచులు శిమ్మ జగన్నాథం, పలిశెట్టి దాసు, శాసపు కేశవరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆరఽశయించారు. దీంతో నగర పంచాయతీ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. అయితే 2023లో నగర పంచాయతీని థర్డ్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఉన్న వివాదం అమరావతిలోని హైకోర్టుకు చేరింది. అయినాసరే కేసును విత్‌డ్రా చేసుకునేందుకు ఆయా సర్పంచిలు ముందుకు రాలేదు.

రెండేళ్ల క్రితం..

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. కోర్టులో పిటిషన్‌ దాఖలుచేసిన సర్పంచిలతో చర్చించారు. దీనిపై కొండంపేట, పొనుగుటివలస సర్పంచిలు మౌనం పాటించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొత్తవలస సర్పంచి శిమ్మ జగన్నాధం మౌనంగా ఉన్నప్పటికీ తమకు పంచాయతీ కావాలని, మున్సిపాలిటీలో ఉండేది లేదని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. ఇదే సమయంలో మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం వల్ల కలిగే నష్టాలు, కుంటుపడుతున్న అభివృద్ధి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు గండిపడడం వంటి అంశాలను రాష్ట్ర అడ్వకేట్‌ జనరల్‌కు రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు విజయవాడ వెళ్లి వివరించారు. హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేశారు. దీంతో ప్రభుత్వం తరపున కమిషనర్‌ వేసిన కౌంటర్‌ పిటిషన్‌ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారు. గతనెల 29న తీర్పును రిజర్వ్‌ చేశారు. ఈనెల 1న రాజాం మున్సిపాలిటీ ఆవిర్భావ వివాదాలకు సంబంధించి ఉన్న పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఆరునెలలోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వార్డులు పెరుగుతాయా?

రాజాం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 32కి పెరగనుంది. 2005లో రాజాం నగర పంచాయతీగా ఆవిర్భవించినపుడు 20 వార్డులు ఉండగా 2023లో థర్డ్‌గ్రేడ్‌ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ కావడంతో ఈ సంఖ్య 24కి చేరింది. ఈఏడాది మేలో 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన జరిపిన నేపధ్యంలో రాజాం మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 24 నుంచి 32కి పెరగాల్సి ఉంది.

ప్రొసీడింగ్స్‌ రావాల్సి ఉంది

రాజాం మున్సిపాలిటీకి సంబంధించి న్యాయస్థానంలో ఉన్న పిటిషన్లను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఆరునెలలలోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే కోర్టు ఇచ్చిన తాజా తీర్పునకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ రావాల్సి ఉంది. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్‌ పాటిస్తాం. ప్రొసీడింగ్స్‌ వచ్చేంతవరకూ ఏమీ చెప్పలేని పరిస్థితి.

- రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం మున్సిపాలిటీ

అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి

రాజాం మున్సిపాలిటీ విషయంలో నడుస్తున్న కేసులను కోర్టు కొట్టేసింది. మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు న్యాయం గెలిచింది. మున్సిపాలటీని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటాం. పట్టణ ప్రజల కోరిక మేరకు అన్ని వార్డులను అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.

- కోండ్రు మురళీమోహన్‌, ఎమ్మెల్యే, రాజాం

Updated Date - Oct 01 , 2026 | 11:55 PM