Share News

After Four Years! నాలుగేళ్ల తర్వాత!

ABN , Publish Date - Sep 28 , 2026 | 10:55 PM

After Four Years! సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరి బిడ్డలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదు. 20సబ్‌ప్లాన్‌ మండలాల్లో ప్రాథమిక విద్యకు వసతి కరువైంది. గిరిజన చిన్నారులు చదువు కునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మారుమూల గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రహదారులకు గ్రహణం పట్టింది. గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేసినా.. అవగాహన లేక పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు.

 After Four Years! నాలుగేళ్ల తర్వాత!
సీతంపేట ఐటీడీఏ కార్యాలయం

  • కనీస సౌకర్యాలకు నోచని గిరిబిడ్డలు

  • ప్రాథమిక విద్యకు వసతి కరువు

  • గిరిజన గ్రామాల రహదారులకు గ్రహణం

  • నత్తనడకన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు

  • ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ఆదరణ కరువు

సీతంపేట, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరి బిడ్డలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదు. 20సబ్‌ప్లాన్‌ మండలాల్లో ప్రాథమిక విద్యకు వసతి కరువైంది. గిరిజన చిన్నారులు చదువు కునేందుకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మారుమూల గిరిజన గ్రామాలకు నిర్మిస్తున్న రహదారులకు గ్రహణం పట్టింది. గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేసినా.. అవగాహన లేక పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు గిరిజనులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే గిరిజనసంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినప్పటికీ క్షేత్రస్థాయిలో పథకాల అమలులో పర్యవేక్షణ కొరవడింది. నేడు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నేపథ్యంలో గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.

పాలకవర్గ సమావేశాలకు నాలుగేళ్లు

వాస్తవంగా ప్రతి మూడు నెలలకొకసారి పాలకవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే సీతంపేట ఐటీడీఏ వేదికగా ఈ సమావేశాలు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సజావుగా జరిగేవి. 2019 తరువాత వైసీపీ సర్కారు ఆ సంస్కృతికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. 2022 ఏడాదిలో ఒకసారి మాత్రమే సీతంపేట ఐటీడీఏ వేదికగా పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పాలకవర్గ సమావేశం ఊసే లేకుండా పోయింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తరువాత నేడు 78వ పాలకవర్గ సమావేశాన్ని ఐటీడీఏలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శిథిలావస్థలో పాఠశాల భవనాలు

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 189 గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో 33 బడులు శిథిలావస్థలో ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన విద్యార్థులు బిక్కుబిక్కు మంటూ చదువుకోవాల్సిన దుస్థితి. జీపీ పాఠశాలల్లో ఇప్పటికీ 12వరకు రేకుల షెడ్డుల్లోనే నిర్వహిస్తున్నారు. దీనిపై గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గిరి రహదారుల పనులకు గ్రహణం..

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో (2022-23) ఉపాధి హామీ పథకం నిధులు రూ.54.88కోట్లతో నిర్మించిన సుమారు 36రహదారులపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికీ వాటిపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచి పోయాయి. విజిలెన్స్‌ నుంచి క్లియరెన్స్‌ వస్తేకాని పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇక రూ.3కోట్లతో కారెం కొత్తగూడ -వంబరెల్లి గ్రామానికి 2022లో రహదారి నిర్మాణం ప్రారంభించిన కాంట్రాక్టర్‌ సగంలో పనులు నిలిపివేశాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆప్రాంత గిరిజనులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు. గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ పరిధిలో మరికొన్ని రహదారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత డోలీరహిత గిరిజన గ్రామాలే లక్ష్యంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం కింద 2025-26లో రూ.4.57 కోట్లతో ఆరు రహదారుల పనులను చేపట్టారు. అయితే వాటిలో నాలుగు రహదా రుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి. పల్లెపండుగ పథకంలో భాగంగా గిరిజన గ్రామాలకు సీసీ రహదారులతో పాటు అంతర్గత రోడ్ల పనులు చేపట్టినా.. నిధులు ఇంకా విడుదల కాలేదు.

ఎప్పటికీ పూర్తయ్యేనో...?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022లో రూ.49.26కోట్లతో సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణం ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం 2025 నాటికి పనులు పూర్తికాలేదు. ఇప్పటికి 80శాతం నిర్మాణం మాత్రమే పూర్తయింది. రూ.25.84కోట్ల వరకు బిల్లుల రూపంలో చెల్లించారు. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో గిరిబిడ్డలకు మెరుగైన వైద్యసేవలు ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఎంఎస్‌ఎంఇ పార్క్‌కు ఆదరణ కరువు

సీతంపేటకు కూత వేటు దూరంలో ఉన్న పాతపనుకువలస ఉద్యాన కేంద్రం సమీపంలో 2025ఏడాదిలో ఎంఎస్‌ఎఈ పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అయితే ఏడాది కాలంలో పార్క్‌లో రహదారులు, విద్యుత్‌, డ్రైన్‌ల నిర్మాణం వంటివి పూర్తిచేశారు. అయితే అవగాహన లేక గిరిజన యువత సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదు.

వైద్యం దయనీయం

ఐటీడీఏ పరిధిలో ఉన్న పీహెచ్‌సీలకు వైద్యాధికారుల కొరత వెంటాడుతోంది. దీంతో సీజన్‌లో జ్వరపీడితులు, ఇతరాత్ర ఆరోగ్య సమస్యలతో పీహెచ్‌సీలను ఆశ్రయించే రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మలేరియా, వైరల్‌ జ్వరాలు కూడా గిరిజనులను పట్టీపీడిస్తున్నాయి. గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గిరిబిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇంకా ఏఎన్‌ఎంలను నియమించలేదు.

Updated Date - Sep 28 , 2026 | 10:55 PM