Share News

12 రోజులుగా మృత్యువుతో పోరాడి..

ABN , Publish Date - Sep 01 , 2026 | 11:31 PM

బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో బెర్రీ పరిశ్రమలో గత నెల 21న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సరోజ్‌ పాల్‌(35) అనే కార్మికుడు మృతి చెందాడు.

12 రోజులుగా మృత్యువుతో పోరాడి..
సరోజ్‌పాల్‌ (ఫైల్‌)

- చికిత్స పొందుతూ బెర్రీ కార్మికుడి మృతి

బొబ్బిలి సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌సెంటర్‌లో బెర్రీ పరిశ్రమలో గత నెల 21న జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సరోజ్‌ పాల్‌(35) అనే కార్మికుడు మృతి చెందాడు. 12 రోజులుగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. సరోజ్‌ పాల్‌ది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాయబరేలీ జిల్లా ఘరంపూరి ఘోపాల్‌ గ్రామం. సుమారు ఏడాదిన్నర బెర్రీ పరిశ్రమలో నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు గత నెల 12న పైపు లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సరోజ్‌పాల్‌తో పాటు బొబ్బిలి మండలం అలజంగి గ్రామానికి చెందిన ఎందవ సీతయ్య అనే మరో కార్మికుడు గాయపడ్డారు. సరోజ్‌పాల్‌ ముఖం, రెండు చేతులు, కాళ్లు 60 శాతం మేర శరీరం కాలిపోయాయి. వీరిని స్ధానిక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. సరోజ్‌పాల్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం

గ్రోత్‌సెంటరు పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కార్మికుల రక్షణ, భద్రత కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయని సీపీఐ, సీపీఎం నేతలు కోట అప్పన్న, మునకాల శ్రీనివాస్‌, పిశంకరరావు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. ‘అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సోమవారం కూడా మరో ఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇది బయటకు పొక్కలేదు. ఈ దారుణాలపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. కాలుష్యంతో పాటు పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం. ఇతర రాష్ర్టాలకు చెందిన కార్మికులైతే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు నోరు మెదపకుండా ఉంటారన్న ఉద్దేశంతో స్థానికులకు కాకుండా వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. చనిపోయిన సరోజ్‌పాల్‌ కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలి. అన్ని రకాల సేఫ్టీ పరికరాలను కార్మికులకు అందజేసి నూరు శాతం భద్రతా చర్యలు చేపట్టాలి.’ అని తెలిపారు.

Updated Date - Sep 01 , 2026 | 11:31 PM