afraid elephants! అమ్మో ఏనుగులు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:08 AM
afraid elephants! ఏనుగులు మళ్లీ వచ్చాయి. జనవరిలో వచ్చి కొన్ని పంటలను ధ్వంసం చేసి అలజడి సృష్టించి తరలిన గజరాజులు మరోసారి జిల్లా వైపు చేరాయి. వాటి సంచారం గురించి తెలిసి సమీప ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం బొబ్బిలి మండలం కమ్మవలస, శివడవలస గ్రామాల పరిసర కళ్లాలు, పంట పొలాల్లో రెండు రోజులుగా ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
అమ్మో ఏనుగులు
అప్పుడప్పుడు జిల్లా వైపు వస్తున్న వైనం
పంట పొలాల ధ్వంసం
తాజాగా కమ్మవలస, శివడవలసలో తిష్ట
భయాందోళనలో సమీప ప్రజలు
బొబ్బిలి రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఏనుగులు మళ్లీ వచ్చాయి. జనవరిలో వచ్చి కొన్ని పంటలను ధ్వంసం చేసి అలజడి సృష్టించి తరలిన గజరాజులు మరోసారి జిల్లా వైపు చేరాయి. వాటి సంచారం గురించి తెలిసి సమీప ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం బొబ్బిలి మండలం కమ్మవలస, శివడవలస గ్రామాల పరిసర కళ్లాలు, పంట పొలాల్లో రెండు రోజులుగా ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శుక్రవారం కమ్మవలసలోని పంట పొలాల్లో తిష్టవేశాయి. నారు మడులను తొక్కేశాయని రైతులు వాపోయారు. వాటి కదలికలను నిరంతరం గమనిస్తున్నామని అటవీశాఖ అధికారి బి.రామనరేష్ తెలిపారు. వాటికి ఎటువంటి హాని తలపెట్టవద్దని సిబ్బంది కోరుతున్నారు. కొన్నేళ్లుగా మన్యం ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు అప్పుడప్పుడు పక్కనే ఉన్న విజయనగరం జిల్లావైపు వస్తున్నాయి. కొద్ది నెలల కిందట వచ్చి మన్యం వైపుగా తరలిన ఏనుగులు మళ్లీ బొబ్బిలి మండలంలో సంచరిస్తున్నాయి. సాగునీటి సరఫరా కోసం రైతులు పొలాల్లో వేసుకున్న పైపులను కూడా ధ్వంసం చేయడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
2015 నుంచి ఏనుగుల రాకపోకలు
ఉమ్మడి విజయనగరం జిల్లాగా ఉన్నప్పుడు పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల కదలికలు 2015 నుంచి ఉన్నాయి. 2018 తర్వాత వాటి సంచారం మరింత పెరిగింది. అప్పుడప్పుడు ఒడిశా వైపు వెళ్తూ మళ్లీ ఇటువైపు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా మన్యం జిల్లాలోనే ఎక్కువ కాలం గడుపుతున్నాయి. 2025 సంవత్సరం నుండి విజయనగరం జిల్లాలో కూడా ప్రవేశిస్తున్నాయి.
- జనవరి నెలలో బొబ్బిలి మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ సీతయ్యపేట గ్రామం శివారున పొలాల్లో తిష్టవేశాయి. రాజుపేట గ్రామంలోని మొక్కజొన్న పొలాల్ని ధ్వంసం చేశాయి. రైతు పూడి అప్పలనాయడుకు చెందిన 80 సెంట్లు మొక్కజొన్న పంటను పాడు చేశాయి. రైతు కర్రి మన్మఽధరావుకు చెందిన 70 సెంట్లలో మొక్కజొన్న పంటను కూడా ధ్వంసం చేశాయి. తాజాగా శుక్రవారం ముత్తావలసకు చెందిన కౌలు రైతు పిల్ల రామారావుకు చెందిన నాలుగు ఎకరాలకు సరిపడా వరి నారును ఏనుగులు నాశనం చేయడంతో రైతు లబోదిబోమంటున్నాడు.
- ఏనుగులు వచ్చాయని అటవీశాఖ సిబ్బంది తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించడమే తప్ప వాటిని అక్కడి నుంచి తరిమే ప్రయత్నాలు పెద్దగా చేయడంలేదు. ఏనుగుల తరలింపులో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులతో చర్చించిన మాజీ సర్పంచ్
బొబ్బిలి మండలం కమ్మవలస గ్రామం సమీపంలో శుక్రవారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ పిల్లా వసుంధర స్థానిక రైతులతో కలిసి స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడ ఉన్న ఫారెస్టు రెస్క్యూ టీం అధికారులతో మాట్లాడారు. మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని అటవీ రెస్క్యూ టీం అధికారులకు సూచించారు.