Cultivation వర్షాభావాన్ని తట్టుకునేలా సాగు చేపట్టండి
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:10 AM
Adopt Cultivation Practices That Can Withstand Drought Conditions ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్ సూచించారు. మంగళవారం రావుపల్లి, సాంబన్నవలసలలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు.
గరుగుబిల్లి, జూన్23(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో నేపథ్యంలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి టి.భవానీశంకర్ సూచించారు. మంగళవారం రావుపల్లి, సాంబన్నవలసలలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేలిక రకం పంటలను సాగు చేసుకుంటే తక్కువ నీటి అవసరం ఉంటుందన్నారు. వరి ఉబాలు కాకుండా ఎదలుపైనే దృష్టి సారించాలని సూచించారు. వర్షపు నీటిని నిల్వ చేసుకునే విధంగా రైతులు పొలాల్లో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. చిరుధాన్యాల సాగుపై ఆసక్తి చూపాలని తెలిపారు. తక్కువ సమయంలో అధిక దిగుబడులు సాధించే పంటలను సాగు చేస్తే నష్టాలబారి నుంచి బయటపడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే భూమి సారవంతమవుతుందన్నారు. అక్రమాలకు తావులేకుండా ఏపీఏఐఎంఎస్ యాప్ విధానంలో ఎరువులు అందించనున్నట్లు తెలిపారు. రైతుల సాగు మేరకు ఆర్‌ఎస్‌కేల ద్వారా ఎరువులు పంపిణీ చేపడుతున్నామన్నారు. షాపుల్లో అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే తమకు తెలియజేయాలన్నారు. సాగుకు సంబంధించి అవసరమైన సలహాలు, సూచలను సిబ్బంది అందించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డీఎం వై.విమల, వ్యవసాయాధికారి టి.జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.