ప్రవేశాలు పెరుగుతున్నాయ్!
ABN , Publish Date - May 16 , 2026 | 12:22 AM
గత వారం రోజుల్లో రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరారు.
-ప్రభుత్వ బడుల్లో చేరుతున్న విద్యార్థులు
-సత్ఫలితాలు ఇస్తున్న అధికారుల చర్యలు
- ఇంటింటా ప్రచారంతో పెరుగుతున్న అడ్మిషన్లు
-గత వారం రోజుల్లో రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరారు. రాజాం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన ముంగండి లాస్య, దోసరి గ్రామానికి చెందిన గొండేల హనీష, గార్రాజు చీపురుపల్లి గ్రామానికి చెందిన 26 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు స్వస్తిపలికి ఎంఈవో దుర్గారావు సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. వీరిలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకూ విద్యార్థులు ఉన్నారు. ఇదే విధంగా జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి.
రాజాం రూరల్, మే 15 (ఆంధ్రజ్యోతి) సర్కారు బడిపై మక్కువ పెరుగుతోంది. చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ఇటీవల వెలువడిన పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థులు సాఽధించిన మార్కుల ప్రభంజనం కూడా ప్రవేశాల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. జిల్లాలో 1452 ప్రాథమిక, 319 ప్రాథమికోన్నత, 464 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 2,24,051 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రైవ్ సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, అందిస్తున్న పథకాల గురించి వివరించి ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ర్యాలీల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి ఐదేళ్లు నిండిన బాలబాలికలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులు, అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. అనేక కారణాల వల్ల బడికి దూరమైన విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకూ నాలుగు వేల మంది చిన్నారుల తల్లిదండ్రులను కలిసినట్టు అధికారులు చెబుతున్నారు. కచ్చితంగా గత ఏడాది కంటే విద్యార్థుల చేరిక పెరిగే అవకాశం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
సర్కారు బడిలో ఎన్నో వసతులు
ప్రభుత్వ బడుల్లో అనేక వసతులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లను తలదన్నేలా భవనాలు, తరగతి గదులు ఉన్నాయి. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉత్తమ విద్యా బోధన, డిజిటల్ తరగతులు, కరాటేలో శిక్షణ, బాలికలకు స్వీయరక్షణ, ఉచిత పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫాం, రక్షిత తాగునీరు తదితర వసతులు ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్లల్లో చదవాలంటే వేలాది రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సబ్జెక్టు నిపుణులు, నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం కూడా ప్రభుత్వ పాఠశాలల సొంతం కావడం కూడా మరో ప్రత్యేకత.