Adjustment of Staff సచివాలయాల సిబ్బంది సర్దుబాటు
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:38 PM
Adjustment of Secretariat Staff జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది వేరే శాఖల్లో సర్దుబాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
కార్యాలయాలకు చేరిన జాబితాలు
గరుగుబిల్లి, జూన్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది వేరే శాఖల్లో సర్దుబాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. జిల్లాలో 15 మండలాలు, మూడు పట్టణాల పరిధిలో 350 సచివాలయాలున్నాయి. వాటిల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమాచారాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయానికి పది మందికి పైగా సిబ్బందిని నియమించారు. అయితే సిబ్బంది అధికంగా ఉన్న నేపథ్యంలో సర్దుబాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు (మహిళా పోలీస్)ను వేరే శాఖలకు పంపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, పాలకొండ, బలిజిపేట మండలాల పరిధిలోని 33 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఏపీఎంఎస్‌ఐడీసీ, ఏపీ ఎస్‌హెచ్‌సీహెచ్, గిరిజన సంక్షేమం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలకు కేటాయించనున్నారు. ఈ మేరకు సచివాలయాల వారీగా జాబితాలను అందించారు. వారితో పాటు మహిళా సంరక్షణ కార్యదర్శులను మెప్మా, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ఐసీడీఎస్ శాఖలకు పంపించేందుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలో వెల్ఫేర్ అసిస్టెంట్లను సాంఘిక సంక్షేమ శాఖకు పంపించే విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక సచివాలయాల పరిధిలో కార్యదర్శి, వీఆర్‌వో, డిజిటల్ అసిస్టెంట్, వ్యవసాయ, పశు సంవర్థకశాఖల సిబ్బంది మాత్రమే ఉండనున్నారు. కాగా సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇతర శాఖల్లో సేవలు అందించ నున్నారు. వేతనం మాత్రం సచివాలయాల్లోనే పొందనున్నారు. మొత్తంగా సచివాలయాలను పూర్తిస్థాయిలో మార్పు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
వేరే శాఖలకు పంపిస్తాం.
సచివాలయాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమాచారాన్ని ఉన్నతాధికారులు కోరారు. పలు శాఖల్లో సిబ్బంది కొరత ఉండడంతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే మండలాల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లను కేటాయించిన శాఖలకు పంపిస్తాం. ఈ ప్రక్రియ కొద్ది రోజుల్లో పూర్తి కానుంది.
- డబ్ల్యూవీఎస్‌ఎస్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పంచాయతీరాజ్‌శాఖ