Online Betting వ్యసనాలకు బానిసై.. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాలై..
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:07 AM
Addicted to Vices... Driven into Debt by Online Betting చెడు వ్యసనాలకు బానిసై .. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాలై.. వరుస చోరీలకు అలవాటు పడ్డాడు. అపహరించిన బంగారు ఆభరణాలను విక్రయించడం కోసం బయల్దేరి పోలీసులకు చిక్కాడు.
విక్రయించడానికి బయల్దేరుతూ పట్టుబడిన వైనం
రూ.71.40 లక్షలు విలువ చేసే 42 తులాల ఆభరణాలు స్వాఽధీనం
పార్వతీపురం టౌన్/ బెలగాం, ఆగస్టు8(ఆంధ్రజ్యోతి): చెడు వ్యసనాలకు బానిసై .. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాలై.. వరుస చోరీలకు అలవాటు పడ్డాడు. అపహరించిన బంగారు ఆభరణాలను విక్రయించడం కోసం బయల్దేరి పోలీసులకు చిక్కాడు. శనివారం పార్వతీపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరానికి చెందిన సువ్వాడ సతీష్ పెద్దగా చదువుకోలేదు. టిఫిన్ షాపుల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పులపాల య్యాడు. ఈజీ మనీ కోసం చోరీల బాటపడ్డాడు. అయితే గతంలోనే సతీష్‌పై పలు కేసులు నమోదై ఉన్నాయి. అయినప్పటికీ తన తీరును మార్చుకోని నింది తుడు తాజాగా ఈ నెల 2,3 తేదీల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. 2వ తేదీ రాత్రి సీతానగరంలోని కుర్మదాసు కిశోర్ ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు 18 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. 3న అదే గ్రామంలోని వక్కలగడ్డ సురేష్ ఇంటిలోని బీరువా పగులగొట్టి 24 తులాల బంగారాన్ని చోరీ చేశాడు. మొత్తంగా రెండు రోజుల్లోనే ఒకే గ్రామంలో సుమారు 42 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురవడం కలకలం రేపింది. దీనిపై బాధితులు సీతానగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పార్వతీపురం రూరల్ సీఐ రంగనాఽథం ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాజేష్, హేమలతతో పాటు మూడు క్రైమ్ టీమ్‌లు, సీసీ టీవీ, సెల్‌ఫోన్ ఆధారాలతో దర్యాప్తు దర్యాప్తు ముమ్మరం చేశారు. చోరీ జరిగిన రోజు పాత నేరస్థుడైన సతీష్ ఓ ఇంటిలో తిరిగినట్టు సీసీ కెమెరాలో కనిపించడంతో ఈ దిశగా విచారణ చేపట్టారు. కాగా దొంగలించిన బంగారు ఆభరణాలను విక్రయించడానికి శనివారం సతీష్ సీతానగరం నుంచి పార్వతీపురం బయల్దేరుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీతానగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద కాపు కాసి సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సతీష్ నుంచి రూ.71.40 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రాత్రి వేళల్లో తాళం వేసి విన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రంగనాఽథం, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.