Share News

అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:16 AM

మహిళలు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి హెచ్చరించారు.

అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు
విద్యార్థులతో మాట్లాడుతున్న డీఎస్పీ భవ్యరెడ్డి

బొబ్బిలి రూరల్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మహిళలు, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డి హెచ్చరించారు. కోమటిపల్లి సమీపంలోని ఫార్మా కళాశాల విద్యార్థినుల పట్ల ఆకతాయిల అసభ్య ప్రవర్తనపై శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘దారి కాస్తూ.. వేధిసూ’్త శీర్షికతో ప్రచురితమైన కథనానికి డీఎస్పీ స్పందించారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం జరిగిన ఘటన తన దృష్టికి రాలేదన్నారు. మహిళల భద్రతకు తాను ప్రాధాన్యమిస్తానన్నారు. కళాశాల విద్యార్థినులను కలిసి ధైర్యం చెబుతానన్నారు. గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. మరలా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఏం సహకారం కావాలన్నా చేసేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని, 100కి ఫోన్‌ చేసి చెప్పినా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గురువారం జరిగిన ఘటనపై కళాశాలకు వెళ్లి విద్యార్థినులతో డీఎస్పీ మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరాతీశారు. లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ వంటి ఘటనలు జరిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీస్‌ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్‌తో ఆమె చర్చించారు.

Updated Date - Feb 21 , 2026 | 12:16 AM