పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:22 AM
పనితీరు మార్చు కోకపోతే చర్యలు తప్పవని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీసీడీవో) కె.మంగాదేవి.. గురవాం కేజీబీవీ ప్రిన్సిపాల్ సావిత్రి, సిబ్బందిని హెచ్చరించారు.
జీసీడీవో మంగాదేవి
గురవాం కేజీబీవీ సందర్శన
రాజాం రూరల్, జూలై 25(ఆంధ్రజ్యో తి): పనితీరు మార్చు కోకపోతే చర్యలు తప్పవని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీసీడీవో) కె.మంగాదేవి.. గురవాం కేజీబీవీ ప్రిన్సిపాల్ సావిత్రి, సిబ్బందిని హెచ్చరించారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘పీటీఎంలో సమస్యలపై నిలదీసిన విద్యార్థులు’ అనే వార్తపై కలెక్టర్ రామసుందర్‌రెడ్డి స్పం దించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమె శనివారం రాజాం ఎంఈవో యాగాటి దుర్గారావుతో కలిసి గురవాం కేజీబీవీని పరిశీలించారు. పాఠశాల పరిసరాలు, దుర్గంధపూరిత వాతావరణం, అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు, విద్యార్థినులు స్నానం చేసే గదుల వద్ద నెలకొన్న పరిస్థితిని చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ సావిత్రితో పాటు బోధన, వంట సిబ్బంది, ఆయాలు, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడారు. పాఠశాల ప్రాంగణంలో రెండేళ్లుగా మురుగు నిలిచిపోవ డాన్ని తప్పుపట్టారు. అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నేలపైనే చపాతీలు ఒత్తడాన్ని తప్పుపట్టారు. రోజూ ఉదయం ఆరు గంటలకే ఆయాలు పాఠశాలకు వచ్చి, గదులను శుభ్రం చేయాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సిబ్బందిని మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉదయం ఎనిమిది గంటలలోపు విద్యార్థులకు టిఫిన్ అందించాలని ఆదేశించారు. పనితీరు మార్చుకో కపోతే చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని రాజాం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి గురవాన నారాయణరావుకు సూచించారు. మొత్తం పరిస్థితిని డీఈవోకు నివేదిస్తానని ఆమె చెప్పారు.