Share News

Maintain Cleanliness పరిశుభ్రత పాటించకుంటే చర్యలు

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:05 AM

Action Against Failure to Maintain Cleanliness జిల్లాలో పరిశుభ్రత పాటించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది కాలంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. మంచిగా చెప్పినా వినని వారి కోసం త్వరలోనే ‘మన్యం మర్యాద’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

  Maintain Cleanliness  పరిశుభ్రత పాటించకుంటే చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • మ‌న్యం జిల్లా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశుభ్రత పాటించని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది కాలంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొన్ని పట్టణ ప్రాంతాల్లో ప్రజల ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. మంచిగా చెప్పినా వినని వారి కోసం త్వరలోనే ‘మన్యం మర్యాద’ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇకపై పరిశుభ్రత పాటించని వారిపై అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్లుపై చెత్తవేసే వారిలో మార్పు తీసుకొస్తామన్నారు. అప్పటికీ మారకుంటే అంటు వ్యాధుల నిరోధక చట్టం కింద కఠిన చర్యలతో పాటు భారీగా జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. గాంధీజీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా శుక్రవారం పార్వతీపురంలోని ఒక ప్రైవేట్‌ కల్యాణ మండపంలో స్వచ్ఛాంద్ర అవార్డుల కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా పలువురికి జిల్లా స్థాయి స్వచ్ఛ విశిష్ట సేవా పురస్కారాలు అందించారు. గ్రామాలు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకున్న వారికి కలెక్టర్‌ అభినంద నలు తెలిపారు. స్వచ్ఛంధ్ర, స్వర్ణాంధ్ర ఆశయ సాధనలో భాగంగా జిల్లాను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గతేడాది గిరిజనులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ గ్రామాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ‘మన ఊరు.. మనం నివసించే ప్రాంతాన్ని మన కోసమే అందంగా ఉంచుకోవాలి.’ అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. ప్రతి ఇంటిలోనూ బంతి మొక్కలను పెంచడం ద్వారా దోమల నివారణతో పాటు పరిసరాలు అందంగా మార్చుకోవచ్చన్నారు. ప్రజలంతా తడి, పొడి చెత్తలను పారిశుధ్య సిబ్బందికి తప్పనిసరిగా అందించాలని ఎమ్మెల్యే విజయచంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ వైశాలి, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, ఆర్డీవో మాధురి, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు , ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డి.రామకృష్ణ , బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పార్వతీపురం డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌గా 2024 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన సచిన్‌ రహర్‌ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:05 AM