Down the Hill! రాళ్లు, రప్పల దారిని దాటి.. కొండ దిగి!
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:37 PM
Across Rocky Paths… Down the Hill! సీతంపేట ఏజెన్సీలో కొన్ని గిరిశిఖర గ్రామాల్లో ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవల కోసం కొండలు దిగి ఎక్కాల్సి వస్తోంది.
రహదారి సౌకర్యం లేక అవస్థలు
సీతంపేట రూరల్, ఏప్రిల్18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో కొన్ని గిరిశిఖర గ్రామాల్లో ప్రజలకు డోలీ మోతలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర వేళల్లో వైద్య సేవల కోసం కొండలు దిగి ఎక్కాల్సి వస్తోంది. మన్యంలోని గిరిశిఖర గ్రామం జాతాపు జజ్జువకు చెందిన నిమ్మక కుమారి కొద్దిరోజులుగా జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతోంది. శనివారం పరిస్థితి విషమించడంతో భర్త నవీన్‌తో పాటు మరికొందరు గ్రామస్థులు డోలీ కట్టారు. ఆమెను మోసుకుంటూ.. 1.5 కిలోమీటర్ల మేర రాళ్లు రప్పల దారిలో నడుచుకుని.. కొండ దిగువన ఉన్న సవరజజ్జువ గ్రామం వరకు వచ్చారు.. అక్కడి నుంచి ఆటో ద్వారా కుటుంబసభ్యులు సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం కుమారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా కొన్నేళ్లుగా తమ గ్రామానికి పక్కా రహదారి లేకపోవడంతో.. ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈవిధంగానే డోలికట్టి ఆసుపత్రికి తరలించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి నిర్మించాలని వారు కోరారు.