Share News

Women Empowerment మహిళా సాధికారితలో మొదటి స్థానంలో నిలవాలి

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:49 PM

Achieve the Top Position in Women Empowerment మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మహిళా సాధికారితలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

  Women Empowerment మహిళా సాధికారితలో  మొదటి స్థానంలో నిలవాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, మార్చి7(ఆంధ్రజ్యోతి): మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. మహిళా సాధికారితలో రాష్ట్రంలోనే మన్యం జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఏపీ ఎన్‌జీవో, మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలి. భయం వీడి సమస్యలపై మాట్లాడాలి. ఆ వైఖరే వారిని విజయపథం వైపు నడిపిస్తుంది. మహిళలు ఎప్పుడూ తల ఎత్తుకొని ఉండాలి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిలో నాయకత్వ లక్షణాలు ఉండాలి. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తాం.’ అని తెలిపారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి మాట్లాడుతూ.. మహిళల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ మహిళల క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు కిషోర్‌, డీఈవో బ్రహ్మాజీరావు, జిల్లా మహిళా సంక్షేమశాఖ పీడీ టి.కనకదుర్గ, జిల్లా కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్‌ నాగ శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:49 PM