Achieve the best rank ఉత్తమ ర్యాంకు సాధించాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 12:06 AM
Achieve the best rank మునిసిపాలిటీలు స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకుల కోసం పోటీ పడాలని, చెత్త నిర్వహణ, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని మునిసిపల్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవీంద్ర సూచించారు. ర్యాంకుల సాధన కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు సోమవారం బొబ్బిలి వచ్చిన ఆయన రామన్నదొరవలసలోని సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కును, కృష్ణాపురం రోడ్డులోని పాత డంపింగ్ యార్డును పరిశీలించారు.
ఉత్తమ ర్యాంకు సాధించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం త్వరలో సర్వే
చెత్త నిర్వహణ, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలి
మునిసిపల్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవీంద్ర
బొబ్బిలి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి)
మునిసిపాలిటీలు స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకుల కోసం పోటీ పడాలని, చెత్త నిర్వహణ, పారిశుధ్యంపై దృష్టిపెట్టాలని మునిసిపల్ శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవీంద్ర సూచించారు. ర్యాంకుల సాధన కోసం అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు సోమవారం బొబ్బిలి వచ్చిన ఆయన రామన్నదొరవలసలోని సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కును, కృష్ణాపురం రోడ్డులోని పాత డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో కమిషనరు, ఇతర అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ప్రగతి వివరాలు సేకరించాలని, మార్చి నెలాఖరులోగా నిధులను వెచ్చించాల్సి ఉందన్నారు. పన్నుల వసూలు లక్ష్యాలను చేరుకోవడం, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ విజయవంతం చేయడం వంటి వాటిపై అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వే జరుగుతుందని, ఇంటింటి చెత్తసేకరణ, సేకరించిన చెత్తను శాగ్రిగేట్ చేసి ఎరువులుగా తయారు చేయడం, వ్యర్థ పదార్ధాలను వినియోగించుకునేలా వేరుచేయడం, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ, మురుగుకాలువల నిర్వహణ, వ్యర్థాల శుద్ధి వంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని చెప్పామన్నారు. చెత్తసేకరణ కోసం కేటాయించిన వాహనాలు మూలకు చేరిన విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, వినియోగంలోనికి తెచ్చేందుకు మునిసిపాలిటీలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు.
- గతంలో మునిసిపాలిటీల ఆధ్వర్యంలో సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కు నిర్వహణ చాలా బాగుండేదని, మెడికోలు, ఇతర మునిసిపాలిటీల అధికారులు, విద్యార్థులు సందర్శనకు వచ్చే వారని విలేకరులు ప్రస్తావించగా అన్నింటినీ చక్కదిద్దుతున్నామని చెప్పారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రశ్నించగా పార్వతీపురంలో మినహా ఇంకెక్కడా వేసవిలో తాగునీటి సమస్య ఉండేది కాదని అన్నారు. బొబ్బిలిలో రెండు రోజుల ఒకసారి నీరు పంపిణీ జరుగుతోందని కమిషనరు ఆయనకు వివరించారు. సమావేశంలో మునిసిపల్ కమిషనరు లాలం రామలక్ష్మి పాల్గొన్నారు.