Share News

Accused in 50 cases... finally caught. 50 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు దొరికాడు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:05 AM

Accused in 50 cases... finally caught. వేర్వేరు జిల్లాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్న నిందితుడు దొరికాడు. విజయనగరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన చోరీ కేసులో లోతుగా విచారించిన పోలీసులు, అతని ప్రతి అడుగుపై నిఘా పెట్టి పట్టుకున్నారు.

Accused in 50 cases... finally caught. 50 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు దొరికాడు
కేసు వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ దామోదర్‌

50 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు దొరికాడు

రూ.50 లక్షల సొత్తు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఎస్పీ దామోదర్‌

విజయనగరం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు జిల్లాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్న నిందితుడు దొరికాడు. విజయనగరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన చోరీ కేసులో లోతుగా విచారించిన పోలీసులు, అతని ప్రతి అడుగుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. విజయనగరం టూటౌన్‌ స్టేషన్‌ పరిధిలోని వైఎస్సార్‌ నగర్‌ సమీప శ్రీసత్యానగర్‌లో నివాసం ఉంటున్న పొట్టా వీర వెంకట స్వామి తన కుటుంబ సభ్యులతో కలిసి మే 30న అన్నవరం వెళ్లారు. తిరిగి 31 రాత్రి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో సామగ్రి కూడా చిందరవందరగా ఉండడంతో వెంటనే టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. అనంతరం సీఐ శ్రీనివాసరావు, సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం సాయంతో కొన్ని ఆధారాలు సేకరించారు. వాటిని లోతుగా పరిశీలించి నేరానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. విశాఖపట్నంలోని మధురవాడలో నివాసం వుంటున్న షేక్‌ అజీజ్‌గా నిర్ధారణకు వచ్చారు. అతని కదలికలపై నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారంతో గురువారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.50 లక్షలు విలువైన 23.5 తులాల బంగారు ఆభరణాలు, 79 తులాల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. నిందితుడు అజీజ్‌పై కాకినాడ జిల్లా గొల్లపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు ఉంది. కోనసీమ, కాకినాడ, ఏలూరు, కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ సిటీ, విజయనగరం జిల్లాల్లో కలిపి 50కి పైగా దొంగతనం కేసులు ఉన్నాయి. నిందితుడిని రిమాండ్‌కు త రలిస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన ఇన్‌చార్జి డీఎస్పీ రాఘవులు, టూటౌన్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ కృష్ణమూర్తి, పీసీలను ఎస్పీ దామోదర్‌ అభినందించారు.

Updated Date - Jun 19 , 2026 | 12:05 AM