Share News

పక్కాగా జనగణన

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:24 AM

భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన(2027) ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని జేసీ సేతు మాధవన్‌ ఆదేశించారు.

పక్కాగా జనగణన
మాట్లాడుతున్న జేసీ సేతు మాధవన్‌

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 16వ జనాభా గణన(2027) ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా నిర్వహించాలని జేసీ సేతు మాధవన్‌ ఆదేశించారు. జనగణన డేటా సేకరణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మంగళవారం జిల్లా స్థాయి శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణన డేటా సేకరణపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. సందేహాలను నివృత్తి చేయడానికి జాయింట్‌ డైరెక్టర్లు, 13 మంది ట్రైనర్లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయడానికి ఆధారంగా ఉంటాయన్నారు. ఖచ్చితమైన సమాచారం తీసుకోవాలన్నారు. ఈ సారి జనాభా లెక్కలు పూర్తిగా మొబైల్‌ యాప్‌ ద్వారా సేకరిస్తారని చెప్పారు. పౌరులు తమ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే సదుపాయం కూడా ఉందన్నారు. మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, రెండో దశలో జనాభా వివరాల సేకరణ జరుగుతుందన్నారు. ప్రతి ఇంటినీ సర్వే చేయాలని, ఎవరినీ విడిచి పెట్టకూడదని తెలిపారు. శిక్షణలో సీపీవో బాలాజీ, డీఈవో మాణిక్యం నాయుడు, సర్వే శాఖ ఏడి విజయకుమార్‌, జెడ్పీ సీఈవో సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 12:24 AM