Study Hardships Continue వసతి సమస్య పట్టదు. చదువు కష్టాలు తీరవు
ABN , Publish Date - Aug 05 , 2026 | 11:41 PM
Accommodation Woes Persist, Study Hardships Continue గిరిజన, మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌక ర్యాలు మెరుగుపడడం లేదు. వసతి సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా బడులకు పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఇరుకు గదుల్లోనే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బొడ్డగూడలో సామాజిక భవనంలోనే బడి, సచివాలయం
బురుజోలలో శిథిలావస్థ రేకుల షెడ్డులోనే బోధనలు
విద్యార్థులు, ఉపాధ్యాయులకు తప్పని అవస్థలు
ఏళ్లు గడుస్తున్నా.. పట్టించుకునే వారేరీ?
భామిని, ఆగస్టు5(ఆంధ్రజ్యోతి): గిరిజన, మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సౌక ర్యాలు మెరుగుపడడం లేదు. వసతి సమస్య పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా బడులకు పక్కా భవనాలు లేకపోవడంతో విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఇరుకు గదుల్లోనే ఇబ్బందులు పడాల్సి వస్తోంది. భామిని మండలంలో బొడ్డగూడ, బురుజోల పాఠశాలలకు భవనాలు నిర్మించాలని పలుమార్లు ఈ ప్రాంతవాసులు కోరినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫలితంగా ఈ ఏడాది కూడా విద్యార్థులు అవస్థల నడుమ పాఠాలు వినాల్సి వస్తోంది.
బొడ్డగూడ గిరిజన గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 68 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో తొలగించారు. దాని స్థానంలో కొత్త భవనం నిర్మించలేదు. గతంలో నాడు-నేడులో భాగంగా చేపట్టిన పాఠశాల భవన నిర్మాణం పిల్లర్లకే పరిమితమైంది. దీంతో కొన్నాళ్లుగా సామాజిక భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే భవనంలో సచివాలయం కూడా కొనసాగుతుండడంతో విద్యార్థులు, ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సుమారు ఆరేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదం డ్రులు పెదవి విరుస్తున్నారు.
భామిని మండల కేంద్రానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బురుజోల పాఠశాల... మోడల్ ప్రైమరీ స్కూల్‌గా గుర్తింపు పొందినా మౌలిక వసతులు మాత్రం మెరుగుపడలేదు. శిథిలావస్థలో ఉన్న రేకుల షెడ్‌లోనే 66 మంది విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోంది. అయితే ఏ మాత్రం వర్షం పడినా వారి బాధలు రెట్టింపు అవుతున్నాయి. మొత్తంగా ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు ఉపాఽధ్యాయులు, విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎంఈవో కె.భాస్కరరావు తెలిపారు. మండలంలో మొత్తం పదకొండు మోడల్ ప్రైమరీ పాఠశాలలల్లో మౌలిక వసతుల కల్పనకు అంచనాలు రూపొందించి విద్యాశాఖాధికారికి పంపించినట్టు ఏఈ సందీప్‌కుమార్ తెలిపారు.