Share News

అందని వసతి!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:39 AM

జిల్లా కేంద్రం విజయనగరంలో ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ తీసికట్టుగా మారింది. బీసీ, ఎస్టీ హాస్టళ్లలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.

 అందని వసతి!
విజయనగరంలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వసతిగృహం

- ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు

- నీటి సదుపాయం కూడా అంతంతే

- చాలాచోట్ల అద్దె భవనాల్లో నిర్వహణ

- విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

దాసన్నపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం విజయనగరంలో ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ తీసికట్టుగా మారింది. బీసీ, ఎస్టీ హాస్టళ్లలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలావరకూ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. రూ.లక్షల్లో అద్దెలు చెల్లిస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై భారం తప్పడం లేదు. వార్డెన్లు సైతం అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వారు ఎప్పుడు వస్తారో?..ఎప్పుడు రారో? తెలియని పరిస్థితి. ఒక్క ప్రాథమిక స్థాయి వసతిగృహాలే కాదు. పోస్టుమెట్రిక్‌ హాస్టళ్ల పరిస్థితి కూడా ఇంతే.

ఇదీ పరిస్థితి..

జిల్లా కేంద్రంలో అన్ని యాజమాన్యాల కింద 23 వసతి గృహాలు ఉన్నాయి. అయితే ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయి వసతులతో లేదు. 11 హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. 1300 మంది విద్యార్థులు వీటిల్లో వసతి పొందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సుంకరవీధిలోని బాలికల వసతి గృహం-3లో 135 మంది విద్యార్థినులు, దీని చెంతనే ఉన్న వసతిగృహం-2లో 80 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ రెండు వసతిగృహాల్లో నీటి సమస్య ఉంది. వాడుక నీరు సరిపడా లభించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు.

విపరీతమైన డిమాండ్‌..

విజయనగరానికి విద్యల నగరంగా పేరొంది. ఇక్కడ అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రైవేటు స్టడీ సర్కిళ్లు, కోచింగ్‌ సెంటర్లు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు చదువుకునేందుకు ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా మహారాజా డిగ్రీ కాలేజీలో విద్యార్థులు ఎక్కువగా అడ్మిషన్లు పొందుతుంటారు. దానికి అనుబంధంగా పీజీ కాలేజీల్లో సైతం చేరుతుంటారు. దీంతో ప్రభుత్వ వసతి గృహాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. కానీ, వీటిల్లో కనీస స్థాయిలో కూడా వసతులు ఉండడం లేదు. దీంతో ఆర్థిక భారం అయినా ప్రైవేటు హాస్టళ్లలో వసతి పొందుతున్నారు. మరికొందరు విద్యార్థులు చిన్నపాటి గదుల్లో అద్దెకు ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వసతిగృహాలకు సంబంధించి సొంత భవనాలు సమకూర్చడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వసతిగృహాల్లో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. వీలైనంత వరకూ వాటిని పరిష్కరిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. హాస్టళ్ల పరిస్థితిని ప్రభుత్వానికి సైతం తెలియజేశాం. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.

-జ్యోతిశ్రీ, జిల్లా బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి, విజయనగరం

Updated Date - Sep 26 , 2026 | 12:39 AM