ప్రమాదపుటంచున..
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:48 PM
విజయనగరం నుంచి కొత్తవలసకు వెళ్లే రహదారిలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి.
శిథిలావస్థలో చినరావుపల్లి, భీమసింగి రైల్వే ఓవర్ బ్రిడ్జిలు
నిర్మించిన కొద్ది ఏళ్లకే దెబ్బతిన్న వైనం
విజయనగరం, కలెక్టరేట్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): విజయనగరం నుంచి కొత్తవలసకు వెళ్లే రహదారిలో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ రెండు ఆర్‌అండ్‌బీ పరిధిలోకి వస్తాయి. కొత్తవలస మండలం చినరావుపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి దాదాపు పదేళ్ల కిందట నిర్మించారు. అయితే అప్పుడే శిథిలావస్థకు చేరింది. ఎక్కడికక్కడే పెచ్చులు ఊడిపోయాయి. అడుగడుగునా బీటలు పడ్డాయి. బ్రిడ్జి మొదటి నుంచి చివరి వరకూ దెబ్బతిన్నది. అలాగే రోడ్డుపై గోతులు పడటంతో ప్ర యాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వంతెనను సు మారు రూ.16కోట్లతో నిర్మించారు. అప్పట్లో నిర్మించి న కాంట్రాక్టర్ రెండేళ్లు మాత్రమే పర్యవేక్షణ చేపట్టారు. తర్వాత దీనిని విడిచిపెట్టడంతో పూర్తిగా పాడయ్యింది. ఈ వంతెనకు విద్యుత్ సదుపాయం కూడా కల్పించలేదు. ఫ ఇదిలా ఉంటే భీమసింగి వద్ద 2018లో రూ.3,725 లక్షలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా మరమ్మతులకు గురయ్యింది. ఎక్కడికక్కడే గోతులు పడ్డాయి. రోడ్డు దెబ్బతిన్నది. గత ఐదేళ్లు ఈ వంతెనను ఎవరూ పర్యవేక్షించకపోవడంతో మరింత అధ్వానంగా మారింది.
నివేదిక పంపిస్తాం
దీనిపై జిల్లా ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి వద్ద ప్రస్తావించగా.. రెండు వంతెనలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరమ్మతులు చేపట్టడానికి అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.