గాలికుంటుతో ప్రమాదం
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:04 PM
పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి.
ఫ నేటి నుంచి వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం
ఫ జిల్లాలో 2.64 లక్షల పశువులు
జియ్యమ్మవలస, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పశువులకు సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే పశువులు, వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి పశుసంవర్థక శాఖ సిద్ధమైంది. ఈ నెల 16 (సోమవారం) నుంచి ఏప్రిల్ 29 వరకు 45 రోజుల పాటు ఈ వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయనున్నారు. 4 నెలలు దాటిన ప్రతి పశువుకూ ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకా వేయించాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. జిల్లాలో సీతంపేట, పాలకొండ, సాలూరు, గరుగుబిల్లి, పార్వతీపురం, కురుపాం, సీతానగరంలో పశు వైద్యశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 37 పశు వైద్య చికిత్సాలయాలు, 54 రూరల్ లైడ్‌స్టాక్ యూనిట్లు ఉన్నాయి. 2019 పశు గణాంకాల ప్రకారం జిల్లాలో ఆవులు 2,28,372, గేదెలు, దున్నలు 36,106 కలిపి మొత్తం 2,64,381 పశు సంపద ఉంది. వీటికి గాలికుంటు వ్యాధి సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ వేయనున్నారు. ఏడుగురు అసిస్టెంట్ డైరెక్టర్ల పర్యవేక్షణలో 37 మంది పశువైద్యాధికారులు, 304 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు.
వ్యాధి లక్షణాలు..
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను సులువుగా గుర్తించవచ్చు. పశువుల్లో తీవ్రమైన జ్వరం రావడంతో పాటు నీరసించిపోతాయి. నోటి నుంచి తీగల వలే చొంగ కారుతూ ఉంటుంది. కాలిగిట్టలు, నోటి వద్ద పుండ్లు ఏర్పడతాయి. కొద్దిపాటి ఎండకు కూడా ఇవి తట్టుకోలేవు. చూడి పశువుల్లో గర్భాస్రావం జరుగుతుంది.
టీకాల వల్ల లాభాలు..
నాలుగు నెలల వయసు దాటిన పశువులు, జీవాలకు ముందు జాగ్రత్త చర్యగా టీకా వేయించాలి. దీనివల్ల పాడి రైతుకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుంది. ఎడ్లలో పని సామర్థ్యం తగ్గకుండా కాపాడవచ్చు. దూడల్లో మరణాలు సంభవించవు. అవి ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
సద్వినియోగం చేసుకోండి
ప్రతి పాడి రైతూ తమ పశువుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా, పశుగ్రాసంలో ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే టీకా వేయడం ఒక్కటే మార్గం. పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
-డాక్టర్ మన్మథరావు, జాయింట్ డైరెక్టర్, జిల్లా పశు సంవర్ధకశాఖ, పార్వతీపురం మన్యం