Share News

ప్రమాదమా.. ఆత్మహత్యా?

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:29 AM

Accident or Suicide? ఆర్థిక సమస్యలా.. గొడవలా..? లేక ప్రమాదమా? కారణమేదో కానీ.. రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో బొబ్బిలికి చెందిన భార్యాభర్త, కొడుకు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమా.. ఆత్మహత్య అన్నది తెలియరాలేదు. ఈ ఘటన సీతానగరం మండలం జగ్గునాయుడుపేట రైల్వే ఎల్‌సీ గేటు దగ్గర శుక్రవారం రాత్రి జరిగింది.

 ప్రమాదమా.. ఆత్మహత్యా?

  • బొబ్బిలికి చెందిన దంపతులు, కుమారుడు మృతి

  • జగ్గునాయుడుపేట రైల్వే ఎల్‌సీ గేటు వద్ద ఘటన

  • దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

బొబ్బిలి/పార్వతీపురం/బెలగాం, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్థిక సమస్యలా.. గొడవలా..? లేక ప్రమాదమా? కారణమేదో కానీ.. రైలు పట్టాలపై ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో బొబ్బిలికి చెందిన భార్యాభర్త, కొడుకు ఉన్నారు. అయితే ఇది ప్రమాదమా.. ఆత్మహత్య అన్నది తెలియరాలేదు. ఈ ఘటన సీతానగరం మండలం జగ్గునాయుడుపేట రైల్వే ఎల్‌సీ గేటు దగ్గర శుక్రవారం రాత్రి జరిగింది.

విజయనగరం జిల్లా బొబ్బిలిలోని రజకవీధికి చెందిన శ్రీనివాసరావు రజక వృత్తి చేసేవారు. ఆయన భార్య సింహాచలం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మెప్మా ఆర్‌పీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వేణు డిప్లొమా పూర్తి చేసి గ్రోత్‌ సెంటర్‌లో పైవ్రేటు ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రాజేష్‌ గంట్యాడ మండలం లక్కిడాం గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఈ కుటుంబం లక్కిడాంలో నివాసం ఉంటోంది. ఆ కుటుంబం కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. మరోవైపు పైవ్రేటు వివాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముగ్గురి మృతికి ఆర్థిక సమస్యలా.. కుటుంబ వివాదాలా.. మరేదైనా కారణమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగ్గునాయుడుపేటకు ఎందుకొచ్చారు?

సింహాచలం స్వగ్రామం జగ్గునాయుడుపేట. ఆమె తల్లి రమణమ్మ మూడు నెలల క్రితమే మృతిచెందారు. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు అన్నదమ్ములు ఉండగా.. వారంతా విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావుకు తల్లి గౌరమ్మ ఉన్నారు. అయితే శుక్రవారం శ్రీనివాసరావు, సింహాచలం, రాజేష్‌ ముగ్గురూ జగ్గునాయుడుపేటకు ఎందుకు వెళ్లారన్నది తెలియరాలేదు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా గూడ్స్‌ రైలు ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు దిగ్భారంతికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ముగ్గురు మృతదేహాలను పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ముగ్గురి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే హెచ్‌సీ బండారు ఈశ్వరరావు తెలిపారు.

Updated Date - Nov 28 , 2026 | 12:29 AM