Accident in Hyderabad Jalaviharహైదరాబాద్ జలవిహార్‌లో ప్రమాదం
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:21 AM
Accident in Hyderabad Jalavihar హైదరాబాద్ జలవిహార్‌లోని ఆర్‌వో ప్లాంటు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన పేలుడులో జిల్లాకు చెందిన ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వలస కూలీలు. కూటి కోసం వెళ్లి ఆపదలో చిక్కుకున్నారు. జామి మండలం భీమసింగి పంచాయతీ శివారు పీతలపాలెంకు చెందిన ఆబోతు గంగులయ్య (45) తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ జలవిహార్‌లో ప్రమాదం
జిల్లాకు చెందిన ఒకరు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
పీతలపాలెంనకు చెందిన వలస కూలీల ఇంట్లో విషాదం
నిస్సాహాయ స్థితిలో నిరుపేద కుటుంబాలు
శృంగవరపుకోట (జామి) ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి):
హైదరాబాద్ జలవిహార్‌లోని ఆర్‌వో ప్లాంటు వద్ద బుధవారం సాయంత్రం జరిగిన పేలుడులో జిల్లాకు చెందిన ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా వలస కూలీలు. కూటి కోసం వెళ్లి ఆపదలో చిక్కుకున్నారు. జామి మండలం భీమసింగి పంచాయతీ శివారు పీతలపాలెంకు చెందిన ఆబోతు గంగులయ్య (45) తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈయన కుటుంబ పరిస్థితి దయనీయం. వారం రోజుల కిందటే కుమార్తెకు వివాహం చేశాడు. అయినప్పటికీ పేదరికం కావడంతో పదోతరగతి పరీక్షలు రాసిన కుమారుడిని స్థానిక బంధువుల ఇంట్లో పెట్టి కూలీపనులకు భార్య దేముడమ్మ, చిన్న అల్లుడు పీతల అంజీ, చిన్న కుమార్తె ధనతో కలసి హైదరాబాద్ జలవిహార్‌కు వలస వెళ్లాడు. మరో 20 నిమిషాలలో అక్కడి నివాసానికి చేరుకోవాల్సిన ఆయన పేలుడులో మృతిచెందాడు. ఇదే ఘటనలో అల్లుడు అంజీ గాయపడ్డాడు. ఇతనితో పాటు కూలిపనులకు వలసవెళ్లిన ఇదే గ్రామానికి చెందిన ముగడ అప్పలనాయుడు తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారని తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు వర్రి వెంకటరమణ, పోలపర్తి స్వామినాయుడు, ఎంపీటీసీ ధనియాల ఫైడిరాజులు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
- పీతలపాలెం గ్రామానికి చెందిన దాదాపు 30 కుటుంబాల వరకు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ జలవిహార్‌లో కూలి పనులు చేసేందుకు వలస వెళ్తున్నారు. ఉచిత వసతి కల్పించడంతో పాటు ఇందులో పనిచేస్తున్న భార్యా,భర్తలకు నెలకు రూ.23వేల వరకు వేతనం అందిస్తున్నారు. వ్యవసాయ పనులు, పండగలు, జాతరలు, వివాహ వేడుకుల సమయంలో ఇళ్లకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇదే విధంగా గంగులయ్య పెద్ద కుమార్తె లక్ష్మి వివాహం కోసం ఇటీవల ఇంటికి వచ్చారు. కొత్తవలస మండలం రామలింగపురం గ్రామానికి చెందిన కోటయ్యతో ఈనెల 2న వివాహాం జరిపించాడు. చిన్న కుమార్తె ఆదికి గతంలోనే తన భార్య దేముడమ్మ తమ్ముడు అంజితో పెళ్లి చేశాడు. చిన్నల్లుడు, చిన్న కూతురు, భార్యతో కలసి నాలుగు రోజుల క్రితం అదివారం హైదరాబాద్ జలవిహార్‌లో పని చేసేందుకు వెళ్లాడు. అంతలోనే పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఎప్పటిలాగే ఇదే గ్రామానికి చెందిన మిగడ అప్పలనాయుడు, చిన్నఅల్లుడు అంజితో కలిసి ముగ్గురు హౌస్ కిపింగ్ పనిచేస్తున్నారు. సాయంత్రం 4.40గంటల సమయంలో ఆర్‌ఓ ప్లాంటు వద్ద భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఇక్కడే వున్న ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. గంగులయ్యను సమీపంలోని జోయ్ ఆసుపత్రికి, అప్పలనాయుడు, అంజీలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. గంగులయ్య బుధవారం రాత్రి 11గంటల సమయంలో మరణించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అప్పలనాయుడు పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అంజీ ప్రాణాలకు ప్రమాదం లేనట్లు తెలిసింది.
- గంగులయ్య కుమారుడు గణేష్ ఇటీవల పదోతరగతి పరీక్షలు రాశాడు. వివాహమైన పెద్దకుమార్తె, పెద్ద అల్లుడు ఇద్దరు దివ్యాంగులు. నిరుపేద కుటుంబం. గ్రామంలో సొంత నివాసం కూడా లేదు. హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినప్పుడు తాటి కమ్మలతో వున్న పూరిపాకలో ఉండేవారు. ఈకుటుంబానికి జీవనాధారమైన వ్యక్తి చనిపోవడంతో కుమారుడి భవిత అయోమయంలో పడింది. తీవ్రంగా గాయపడిన అప్పలనాయుడుకు భార్య సింహాచలం, ఇంటర్ చదువుతున్న కుమారుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. కుమారుడ్ని గ్రామంలో వదిలి భార్యతో కలిసి హైదరాబాద్ జలవిహారంలో కూలీపనులు చేసుకుంటున్నాడు. ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే మండల టీడీపీ నాయకులు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. గంగులయ్య కుమారుడు గణేష్ ఉన్నత చదవుకు ఆర్థిక సహాయం అందిస్తానని టీడీపీ జామి మండల అధ్యక్షుడు వర్రి వెంకటరమణ హామీ ఇచ్చారు.