accident గుంతల రహదారికి యువకుడి బలి
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:20 AM
accident గోతులమయమైన బొబ్బిలి-రామభద్రపురం జాతీయ రహదారిలో ఆదివారం ఘోరం జరిగిపోయింది. రోజూ అదే దారిలో ప్రయాణించే ఓ యువకుడు గుంతను గుర్తించలేకపోయాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అందులో నీరు చేరి ఉండడంతో గోతిని గమనించలేక యథావిధిగా ముందుకెళ్లాడు.
గుంతల రహదారికి యువకుడి బలి
గొర్లెసీతారాంపురం వద్ద గోతిలో పడి అదుపు తప్పిన బైక్
యువకుడి మృతి
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): గోతులమయమైన బొబ్బిలి-రామభద్రపురం జాతీయ రహదారిలో ఆదివారం ఘోరం జరిగిపోయింది. రోజూ అదే దారిలో ప్రయాణించే ఓ యువకుడు గుంతను గుర్తించలేకపోయాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అందులో నీరు చేరి ఉండడంతో గోతిని గమనించలేక యథావిధిగా ముందుకెళ్లాడు. దాంట్లో పడిన బైక్ భారీ కుదుపునకు లోనై అదుపు తప్పింది. కింద పడిపోయిన యువకుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. గొర్లెసీతారాంపురం గ్రామ సమీపంలో సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి సాయికృష్ణ అలియాస్ సిద్ధు(25) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గొల్లపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి గొల్లపల్లి సాయికృష్ణ అలియాస్ సిద్ధు తన స్నేహితుడు వర్రి నానితో కలిసి సోమవారం జరగనున్న అన్న సమారాధనకు అవసరమైన కూరగాయలు, సరుకుల కోసం ఆదివారం ద్విచక్ర వాహనంపై రామభద్రపురం వెళ్లారు. తిరిగి ప్రయాణంలో వస్తుండగా గొర్లెసీతారాంపురం వద్ద రహదారిపై ఉన్న గుంతను సాయికృష్ణ గమనించలేకపోయాడు. అందులో నీరు ఉండడంతో లోతును అంచనా వేయలేకపోయాడు. యథావిధిగా ముందుకెళ్లగా గుంతలో పడిన బైక్ అదుపు తప్పింది. తీవ్రంగా గాయపడిన సాయికృష్ణను వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సాయికృష్ణ తండ్రి రామారావు ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి దాలమ్మ గృహిణి. అప్పటికి కొద్ది గంటల ముందే తమతో మాట్లాడిన కుమారుడు ఇక లేడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరు విలపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీనాయన ఆసుపత్రికి చేరుకుని యువకుడి తల్లిదండ్రులను ఓదార్చారు. గాయపడిన నానిని పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫ గొర్లెసీతారాంపురం వద్ద రహదారి అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.