accident పెళ్లి పీటలెక్కాల్సిన యువతి..
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:40 AM
accident కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులు ఇటీవలే ఓ సంబంధం చూసి నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లి ముహూర్తం తీయాలనుకుంటున్నారు. పాపం అంతలోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆటో ప్రమాదం రూపంలో కుమార్తెను మృత్యువు కబళించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
పెళ్లి పీటలెక్కాల్సిన యువతి..
ఆటో ప్రమాదంలో మృతి
నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజుల్లోనే విషాదం
గంట్యాడ, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్న ఆ తల్లిదండ్రులు ఇటీవలే ఓ సంబంధం చూసి నిశ్చితార్థం కూడా చేశారు. పెళ్లి ముహూర్తం తీయాలనుకుంటున్నారు. పాపం అంతలోనే ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆటో ప్రమాదం రూపంలో కుమార్తెను మృత్యువు కబళించింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
గంట్యాడ మండలంలోని నరవ గ్రామానికి చెందిన బోనెల శ్రీను, వరలక్ష్మీకి ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమార్తె ప్రియ ఇంటర్ చదువుతుండగా పెద్ద కుమార్తె రేణుక (18) విజయనగరం పట్టణంలో ఓ దుస్తుల దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తోంది. గత డిసెంబరులో ఈ ఉద్యోగంలో చేరింది. ఆదివారం షాపు యాజమాన్యం ఆదేశాల మేరకు షాపు ప్రచారం కోసం ఆటోలో మరికొంతమంది సిబ్బందితో కలిసి రేణుక మండలంలోని సిరిపురం, మురపాక, పెదవేమలిలో కరపత్రాలు పంపిణీ చేయడానికి వెళ్లారు. అనంతరం తిరిగి ప్రయాణయ్యారు. నరవ గ్రామ శివారులో హనుమాన్ ఆలయం వద్దకు వచ్చేసరికి రేణుక ఆటో నుంచి ప్రమాదవశాత్తూ జారిపోయింది. తలకు బలమైన గాయమైంది. చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సాయికృష్ణ తెలిపారు. రేణుకకు ఇటీవలే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో వివాహ నిశ్చితార్థం జరిగినట్లు కుటుంబీకులు వెల్లడించారు. తండ్రి శ్రీను క్వారీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లి వరలక్ష్మీ కూడా దుస్తుల దుకాణంలో పనిచేస్తోంది. తమకు అన్ని విధాలుగా అండగా ఉంటుందనుకున్న కుమార్తె అందని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.