నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:41 AM
జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది.
- 18 వరకు ప్రక్రియ
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
పార్వతీపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. చైర్పర్సన్, కౌన్సిలర్ల అభ్యర్థుల నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు. ఈ నెల 18 వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. 19న వాటిని పరిశీలిస్తారు. 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 28న పోలింగ్ నిర్వహించి.. 30న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించి 9 గదులు సిద్ధం చేశారు. చైర్మన్ నామినేషన్ల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు.
విగ్రహాలకు ముసుగు పడింది
జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్వతీపురంలో పలువురు రాజకీయ నాయకుల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. అదే విధంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, జెండాలను తొలగించారు.
సజావుగా నిర్వహిస్తాం: కమిషనర్
పార్వతీపురంటౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగే విధంగా చర్యలు చేపట్టిన్లు కమిషనర్ బి.రామ్గోపాల్ తెలిపారు. 36వార్డుల్లో పోటీ చేయనున్న వివిధ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలోని గదులను ఆయన గురువారం పరిశీలించారు. 1 నుంచి 8వ వార్డు వరకు రూమ్ నెంబరు-2లో, 9 నుంచి 16 వార్డు వరకు రూమ్-3లో, 17 వార్డు నుంచి 24 వార్డు వరకు రూమ్-4లో, 33 వార్డు నుంచి 36 వార్డు వరకు రూమ్ 5లో, 25 వార్డు నుంచి 32 వార్డు వరకు రూమ్ నెంబరు-6లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు చెప్పారు. చైర్పర్సన్ నామినేషన్ల స్వీకరణ 8వ గదిలో జరుగుతుందని అన్నారు.