ACB tension ఏసీబీ గుబులు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:09 AM
ACB tension గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు రెవెన్యూ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మోపిన అభియోగాలు నేడు వారిని వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లూ చర్యలు లేకపోవడంతో అంతా మరుగున పడిపోయినట్టే అనుకున్నారు కానీ ఈ గడువులో రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఏసీబీ వాస్తవాన్ని తేల్చేపనిలో పడింది.
ఏసీబీ గుబులు
వైసీపీ ప్రభుత్వంలో ఆరు తహసీల్దార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు
నాలుగేళ్ల కిందట అభియోగాల నమోదు
సీసీఎల్‌ఏ నుంచి తాజాగా విచారణకు ఆదేశాలు
పదోన్నతలపై ప్రభావం పడుతుందని అధికారులు, ఉద్యోగుల్లో కలవరం
గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు రెవెన్యూ అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మోపిన అభియోగాలు నేడు వారిని వెంటాడుతున్నాయి. ఇన్నాళ్లూ చర్యలు లేకపోవడంతో అంతా మరుగున పడిపోయినట్టే అనుకున్నారు కానీ ఈ గడువులో రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఏసీబీ వాస్తవాన్ని తేల్చేపనిలో పడింది. అప్పట్లో ఏసీబీ రికార్డుల్లో నమోదైన అధికారులు, ఉద్యోగులకు నోటీసులు ఇస్తోంది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందోనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. కొందరేమో పదోన్నతులపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
శృంగవరపుకోట, మార్చి 11(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర వ్యాప్తంగా 2021 జూలైలో ఎంపిక చేసిన తహసీల్దార్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. జిల్లాలో శృంగవరపుకోట, కొత్తవలస, జామి, భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. వరుసగా మూడు రోజుల పాటు ఈ కార్యాలయాల్లో పని చేసే ప్రతి అధికారి, ఉద్యోగి, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. 2020 జూన్ నుంచి జరిపిన కార్యకలాపాల రికార్డులను తనిఖీ చేశారు. ఏసీబీ వచ్చే సమయానికి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది వద్ద వున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వ్యవహరించని ప్రతి చిన్న విషయాన్నీ రికార్డు చేశారు. అనంతరం అప్పటి ప్రభుత్వానికి నివేదించారు.
విడతల వారీగా నోటీసులు
నాలుగేళ్ల క్రితం జరిగిన ఏసీబీ దాడుల్లో అభియోగాలకు గురైన అధికారులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత నుంచి విచారణకు ఆదేశాలు వస్తున్నాయి. శృంగవరపుకోట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ మోపిన అభియోగాల ప్రకారం 2020 జూన్ నుంచి 2021 జూలై వరకు పనిచేసిన ముగ్గురు తహసీల్దార్‌లకు, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, సినియర్ అసిస్టెంట్, మండల సర్వేయర్, ఏడుగురు గ్రామ రెవెన్యూ అధికారులకు గత ఏడాది మేలో సీసీఎల్‌ఏ నుంచి విచారణ ఆదేశాలు వచ్చాయి.
ఫ నాలుగు రోజుల క్రితం అప్పట్లో కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు ఆర్‌ఐలు, ఐదుగురు గ్రామ రెవెన్యూ అధికారులకు కూడా సీసీఎల్‌ఏ నుంచి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పట్లో ఒకేసారి తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు జరిగినప్పటికీ సీసీఎల్‌ఏ నుంచి మాత్రం విచారణకు ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికి ఒక్కోసారి విచారణ ఆదేశాలు వస్తున్నాయి. తప్పు చేయకపోయినా అవినీతి మచ్చ అంటించుకోవాల్సి వచ్చిందని కొంతమంది అధికారులు వాపోతున్నారు.
ఆది నుంచీ భూ అక్రమాలు
2019 జూన్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆది నుంచే నేతలు భూ అక్రమాలకు తెరదీశారు. తాము చెప్పే పనులు చేసే అధికారులను తహసీల్దార్ కార్యాలయాలకు తెచ్చుకున్నారు. ఇష్టం లేకపోయినా అధికారులు నిబంధనలు అతిక్రమించారు. కొందరు బహిరంగంగానే చేయి చాపడం మొదలెట్టారు. ఇదే సమయంలో కొవిడ్-19 కొనసాగుతున్న రోజులవి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. ఇదే అదనుగా స్థానిక నాయకులు తహసీల్దార్ కార్యాలయాలను గుప్పిట్లోకి తీసుకున్నారు. కొంత మంది అధికారులు, నాయకులు కలిపి ఇష్టానురీతిగా వ్యవహరించడంతో అంతులేని అవినీతి, ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల తరువాత తేరుకున్న వైసీపీ ప్రభుత్వం తాము అవినీతికి చోటివ్వబోమని ప్రజలకు సాంకేతాలు పంపేందుకు అవినీతి నిరోధక శాఖను ఉసుగొల్పింది. ఎస్.కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల పరిధిలోని మూడేసీ మండలాల్లో అప్పట్లో ఏసీబీ ఆకస్మిక దాడులకు దిగింది. అప్పట్లో అభియోగాలు నమోదు చేసిన ఏసీబీ, కూటమి ప్రభుత్వం వచ్చాక విడతల వారీగా విచారిస్తోంది.
------------------