చదువు కష్టాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:31 PM
మండలంలోని పీవి ఈతమానుగూడ పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం చావిడివలసలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గిరిజన విద్యార్థులకు చదువుల కష్టాలు తప్పడం లేదు.
- చావిడివలస పాఠశాలలో వసతి సమస్య
- గిరిజన విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
సీతంపేట రూరల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పీవి ఈతమానుగూడ పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామం చావిడివలసలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గిరిజన విద్యార్థులకు చదువుల కష్టాలు తప్పడం లేదు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 77మంది విద్యార్థులు చదువుతున్నారు. పిల్లలు ఎక్కువ మంది ఉండడం, గదులు తక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో గ్రామస్థులు సొంత ఖర్చుతో రేకుల షెడ్డును నిర్మించా ,రు. కాలక్రమేనా ఆ షెడ్డు శిథిలమై నీరు కారిపోతుండడంతో పాఠశాల ఉపాధ్యాయులే చందాలు వేసుకొని కొత్తగా రెండు రేకుల షెడ్లను నిర్మించారు. ఈ చిన్నపాటి రేకుల షెడ్లలోనే పిల్లలకు పాఠాలు భోదిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు కింద ఈ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. కానీ, అదనపు గదుల కోసం మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదు. అదనపు తరగతి భవనం కోసం గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టిన స్పందన రాలేదు. అయితే, కూటమి ప్రభుత్వంలో వసతి సమస్య తీరుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆశ పడ్డారు. కానీ, ప్రభుత్వం ఏర్ప ,డి రెండేళ్లు అయినా చావిడివలస పాఠశాల పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఈ పాఠశాలతో పాటు మర్రిపాడు, కిరప తదితర ప్రాథమిక పాఠశాలలు కూడ వసతి సమస్యతో అల్లాడుతున్నాయి. ఒకే భవనంలో రెండు నుంచి మూడు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇరుకు గదిలో చదవలేక గిరిజన చిన్నారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. దీనిపై ఎంఈవో ఆనందరావును వివరణ కోరగా.. ‘అదనపు భవనాల కోసం గత ప్రభుత్వానికి నివేదించాం. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వసతి సమస్యతో గిరిజన చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటి ప్రభుత్వానికి కూడా ప్రతిపాదనలు పంపించాం.’ అని తెలిపారు.