Share News

Aarogyamastu ఆరోగ్యమస్తు

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:49 PM

Aarogyamastu సీతంపేట మన్యంలో కిడ్నీ బాధితుల కష్టాలు తీరనున్నాయి. ఇకపై డయాలసిస్‌ కోసం పాలకొండ వరకూ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. త్వరలోనే వారు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఆ సేవలు పొందొచ్చు. కూటమి ప్రభుత్వం చొరవతో గిరిజన ప్రాంతాల్లో మొదటివిడతగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

Aarogyamastu ఆరోగ్యమస్తు
సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్‌ కేంద్రం

  • కిడ్నీ బాధితులకు తీరనున్న కష్టాలు

  • సీతంపేట ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం

  • ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ ఏర్పాటు

  • అత్యాధునిక పరికరాలతో రక్తపరీక్షలు

  • త్వరలో ప్రారంభోత్సానికి సన్నాహాలు

సీతంపేట రూరల్‌, జనవరి28(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో కిడ్నీ బాధితుల కష్టాలు తీరనున్నాయి. ఇకపై డయాలసిస్‌ కోసం పాలకొండ వరకూ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. త్వరలోనే వారు సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఆ సేవలు పొందొచ్చు. కూటమి ప్రభుత్వం చొరవతో గిరిజన ప్రాంతాల్లో మొదటివిడతగా ఏర్పాటు చేయనున్న డయాలసిస్‌ కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు జిల్లాలోని సీతంపేట, విజయనగరం జిల్లాలోని ఎస్‌కోట ఏరియా ఆసుపత్రుల్లో కేంద్రాలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. ఒక్కో కేంద్రంలో సుమారు రూ.85లక్షల విలువచేసే అధునాతన రక్తశుద్ధి యంత్రాలతో పాటు పరికరాలను అందు బాటులో ఉంచారు. ఐదు బెడ్‌లకు ఐదు యంత్రాలను సిద్ధం చేశారు. ఈ డయాలసిస్‌ కేంద్రంలో రోజుకు మూడు సెషన్లలో కిడ్నీ రోగులకు రక్తశుద్ధి సేవలు అందించనున్నారు. సీతంపేట ఏజెన్సీ లోని స్థానిక ఏరియా ఆసుపత్రిలో డయాలసెస్‌ సేవలు త్వరలో అందుబాటులోకి రానుండడంతో ఈ ప్రాంత గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న బాధితులు

సీతంపేట మన్యంలో రోజురోజుకూ కిడ్నీ వ్యాధి బాధితులు పెరుగుతున్నారు. డయాలసిస్‌ కోసం వారు గడిచిన కొంతకాలంగా వ్యయప్రయాసలకోర్చి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొండ ఏరియా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు కూడా భారంగా మారు తున్నాయి. ఇది గమనించిన కూటమి ప్రభుత్వం గిరిజనుల కోసం డయాలసిస్‌ కేంద్రం ఏర్పా టుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా మొదటివిడతలో మంజూరు చేసిన డయా లసిస్‌ కేంద్రాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా సీతంపేట ఏరియా ఆసుపత్రిలో అధునూతన వైద్యపరికరాలతో కేంద్రాన్ని సిద్ధం చేశారు. ఐదు బెడ్‌లతో కూడిన ఈ డయా లసిస్‌ కేంద్రంలో డయలైజర్‌(రక్తశుద్ధి)పరికరాలతో పాటు యంత్రాలు, ఇతరాత్ర ఎక్విమెంట్‌లు అన్ని సిద్ధంగా ఉంచారు. త్వరలోనే ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొత్తం గా ఏజెన్సీలో డయాలసిస్‌ స్టేజ్‌లో కొట్టుమిట్టాడుతున్న గిరిజన రోగులు ఈ కేంద్రం ద్వారా ఎంతో ఉపశమనం కలగనుంది.

ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్‌ఎల్‌

సీతంపేట మన్యంలో నివసిస్తున్న గిరిజనులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా అత్యాధునిక పరికరాలతో వ్యాధి నిర్ధారణ రక్తపరీక్షలు నిర్వహించేందుకు గాను సీతంపేట ఏరియా ఆసుపత్రిలో ఐపీహెచ్‌ఎల్‌ (ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌రేటరి)ని ఏర్పాటు చేశారు. నూతనంగా నిర్మించిన ఏరియా ఆసుపత్రి భవనంలోని రెండో అంతస్తులో ఎనిమిది గదులను సిద్ధం చేశారు. అయితే ఇంకా మిషనరీలు పూర్తిస్థాయిలో రాలేదు. ఈఏడాది ఏప్రిల్‌ చివరినాటికి ల్యాబ్‌ పరికరాలన్ని సీతంపేట ఏరియా ఆసుపత్రికి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్‌లో సంక్రమిత, అసంక్రమిత కేటగిరీలకు సంబంధించి 134రకాల నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. సుమారు రూ.1.2కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటుచేస్తున్నారు.

సిద్ధం చేశాం..

కిడ్నీ రోగుల కోసం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రంలో అన్నీ సిద్ధం చేశాం. ఈ సెంటర్‌లో ఒకేసారి ఐదుగురు కిడ్నీ బాధితులకు డయాలసిస్‌ చేయొచ్చు. ఫిబ్రవరి 1న ఈ కేంద్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ వస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఇంకా అధికారికంగా ఆయన పర్యటన ఖరారు కాలేదు. ఐపీహెచ్‌ఎల్‌ ల్యాబ్‌ మంజూరు చేశారు కానీ దీనికి సంబంధించి విధివిదానాలు ఇంకా అందలేదు. నూతన భవనంలో కేటాయించిన గదుల్లో ప్రస్తుతం సాధారణ రక్తపరీక్షలను నిర్వహిస్తున్నాం.

- బి.శ్రీనివాసరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌, సీతంపేట

Updated Date - Jan 28 , 2026 | 11:49 PM