Share News

పన్నెండేళ్ల కల చట్టబద్ధతతో సాకారం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:19 AM

రాజధాని అమరావతి చట్టబద్దతతో పన్నెండేళ్ల కల సాకారమైందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు.

పన్నెండేళ్ల కల చట్టబద్ధతతో సాకారం
మాట్లాడుతున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి చట్టబద్దతతో పన్నెండేళ్ల కల సాకారమైందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు. ఆదివారం పట్టణంలో అమరావతి రాజధానికి మద్దతుగా మంత్రి తన నివాసం నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు థ్యాంక్యూ సీఎం సార్‌ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళు లర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. చంద్రబాబు పిలుపు అమరావతి గెలుపుగా మారిందన్నారు. రాజధానిపై జగన్‌ ఎంత విషప్రచారం చేసినా రాజధాని మార్చలేరన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. అలాంటి రైతులు 1631 రోజులు ధర్నా చేస్తే వారిని బూటు కాళ్లతో తన్నడం, జైలులో పెట్టడంలాంటి దుర్మార్గపు పనులు చేశారన్నారు. అమరావతి రాజధానికి పార్లమెంట్‌లో వివిధ పార్టీల మద్దతు తెలిపితే.. వైసీపీ మాత్రం వాకౌట్‌ చేసిందన్నారు. దీంతో రాష్ట్రాభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందన్నారు. మూడు రాజధానుల పే రుతో మూడు ప్రాంతాల్లో జగన్‌ చిచ్టుపెట్టాలని చూశారన్నారు. విలువలు, విశ్వసనీయతపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణం సాగుతోందన్నారు. రాజధాని విషయంలో 9 సార్లు మాట మార్చిన జగన్‌.. ఇప్పుడు మావిగన్‌ అంటుం టే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, కూనిశెట్టి భీమారావు, బలగ పైడిరాజు, వాడాడ శోభారాణి, గాడి లక్ష్మణ, యాసర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:19 AM