Share News

Lodda Waterfall ఎంతో ప్రత్యేకం.. లొద్ద జలపాతం

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:45 PM

A Truly Special Attraction: Lodda Waterfall జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గురువారం సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి లొద్ద జలపాతం వద్ద సౌకర్యాలు ప్రారంభించారు.

 Lodda Waterfall ఎంతో ప్రత్యేకం.. లొద్ద జలపాతం
లొద్ద జలపాతం

  • మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

  • జలపాతం వద్ద సౌకర్యాలు ప్రారంభం

సాలూరు, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జలపాతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గురువారం సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి లొద్ద జలపాతం వద్ద సౌకర్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మన్యంలో ఎన్నో అద్భుత జలపాతాలు ఉన్నాయి. వాటిల్లో లొద్ద జలపాతం ఎంతో ప్రత్యేకం. సుమారు వంద అడుగులపై నుంచి జాలువారే జలధారలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. లొద్ద జలపాతం వద్ద సందర్శకులకు ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. స్థానిక గిరిజనుల సహకారంతో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపట్టాం. స్థానిక గిరిజనులతో స్టాల్స్‌, పలు దుకాణాలు ఏర్పాటు చేయించాం. వాటి ద్వారా గిరిపుత్రులు తమ పంటలు, అటవీ ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ గ్రామానికి వచ్చా. అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం.. పట్టుచెన్నూరు నుంచి లొద్ద జలపాతం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేశాం. కొదమ పంచాయతీలోని చాలా గ్రామాల్లో సుమారు రూ.15 కోట్లతో రహదారి పనులు చేపడుతున్నాం. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ’ అని తెలిపారు. అంతకుముందు ఆమెకు గిరిజనులు థింసా నృత్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ‘స్వాతంత్య్రం వచ్చిన తరువాత తమ గ్రామాన్ని మంత్రి హోదాలో సందర్శించింది మీరే’ అంటూ గ్రామస్థులు ఆమెపై పూల వర్షం కురిపించి.. హారతులిచ్చారు. అనంతరం జలపాతం వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించారు.

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమాలో కనిపించే జలపాతాలకంటే లొద్ద వాటర్‌ ఫాల్‌ చాలా పెద్దది. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తయిన కొండల మధ్య ఈ జలపాతం ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల గిరిజనుల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. ఎంతోమందికి స్థానికంగా ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. గిరిజన గ్రామాలన్నింటినీ అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. డోలీ మోతలను పూర్తిస్థాయిలో నివారించేందుకు చర్యలు చేపడుతోంది.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఎఫ్‌వో ప్రసూన, ఉమ్మడి జిల్లాలో పలు మండలాలకు చెందిన అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వీవోఏలు, అటవీశాఖ సిబ్బంది , సాలూరు, మక్కువ మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోటెత్తిన సందర్శకులు

మక్కువ రూరల్‌, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): లొద్ద జలపాతాన్ని చూసేందుకు గురువారం వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చారు. తొలుత కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు వైశాలి, పవార్‌స్వప్నిల్‌ జగన్నాఽథ్‌ తదితరులు జిల్లా అధికారులతో కలిసి నంద గ్రామం నుంచి లొద్ద జలపాతం వరకు బైక్‌లతో ర్యాలీగా వెళ్లారు. నంద చేరుకున్న మంత్రి సంధ్యారాణి కూడా లొద్ద వద్దకు తన కాన్వాయ్‌తో బయల్దేరారు. ఆ తర్వాత సాలూరు, మక్కువ, పార్వతీపురం ప్రాంతాలకు చెందిన సందర్శకులు లొద్ద జలపాతం చేసేందుకు పెద్దఎత్తున తరలివెళ్లారు. అయితే జలపాతం చేరుకునేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం, కొండ ఎక్కాల్సి రావ డంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు ఘాటీ ఎక్కలేక వెనుదిరిగారు. లొద్ద వరకు రోడ్డు నిర్మాణానికి గతంలో కలెక్టర్‌ రూ. 6కోట్లు మంజూరు చేశారు. అయితే పూర్తిస్థాయిలో పనులు చేపట్టకపోవడంతో సందర్శకులకు ఇక్కట్లు తప్పలేదు. ఘాట్‌ రోడ్డులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అటవీశాఖాధికారులు మార్గమధ్యంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేసి వాహనదారులను నెమ్మదిగా లొద్ద జలపాతం వద్దకు పంపించారు.

- లొద్ద నుంచి జలపాతం వరకు చేపట్టనున్న రోడ్డు పనులకు, రూ.కోటి 80లక్షలతో పర్యాటకుల కోసం అతిథి గృహం నిర్మాణానికి మంత్రి ఆ గ్రామంలో శంకుస్థాపన చేశారు. కొదమ నుంచి జలపాతానికి సందర్శకులను తీసుకెళ్లి, తీసుకొస్తున్న గిరిజన యువకులు గైడ్లుగా వ్యవహరిస్తుండగా వారికి బైకులు అందిస్తామని ఆమె తెలిపారు. ట్రెక్కింగ్‌ మాస్టార్లను నియమిస్తామన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:45 PM