A tribute to Bobbili warriors బొబ్బిలి యుద్ధవీరులకు ఘన నివాళి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:07 AM
A tribute to Bobbili warriors పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి యుద్ధంలో అమరులైన వీరులకు రాజవంశీయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన టీడీపీ శ్రేణులతో కలిసి శనివారం నివాళులు అర్పించారు. ప్రతేక వేషధారణలో ఆకట్టుకున్నారు.
బొబ్బిలి యుద్ధవీరులకు
ఘన నివాళి
యుద్ధ స్మారక స్తంభం వద్ద స్మృత్యంజలి
ప్రత్యేక వేషధారణలో బేబీనాయన
బొబ్బిలి, జనవరి 24(ఆంధ్రజ్యోతి):
పౌరుషాగ్నికి ప్రతీకగా నిలిచిన బొబ్బిలి యుద్ధంలో అమరులైన వీరులకు రాజవంశీయుడు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన టీడీపీ శ్రేణులతో కలిసి శనివారం నివాళులు అర్పించారు. ప్రతేక వేషధారణలో ఆకట్టుకున్నారు. 268 ఏళ్ల క్రితం (1757 జనవరి 24 న) సరిగ్గా ఇదే రోజున విజయరామరాజును హతమార్చిన తాండ్ర పాపారాయుని పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. తొలుత భైరిసాగరం చెరువు గట్టుపై ఉన్న యుద్ధ స్మారకస్తంభం వద్దకు చేరుకొని అక్కడ యుద్ధవీరులకు స్మృత్యంజలి ఘటించారు. అలాగే బొబ్బిలి కోట తూర్పుదేవిడి ముందు ఉన్న ఆఖరిపట్టాభిషిక్తుడు రాజా రంగారావు విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు, గ్రంథాలయసంస్థ రాష్ట్ర డైరెక్టరు రౌతు రామ్మూర్తి, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, గెంబలి శ్రీనివాసరావు, సీనియర్ నేత అల్లాడ భాస్కరరావు, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టరు సుంకరి సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధ సమయంలో అద్భుతఘట్టం: ఎమ్మెల్యే బేబీనాయన
బొబ్బిలి యుద్ధ సమయంలో చోటుచేసుకున్న కీలక ఘట్టంపై బేబీనాయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విజయనగరం రాజుల చేతిలో ఓటమి అనివార్యమని తెలిసిన వెంటనే రాణిమల్లమ్మదేవి తమ ఇలవేల్పు వేణుగోపాలస్వామి మూలవిరాట్‌ను కూలీలతో రహస్యంగా మచిలీపట్నానికి తరలించే ఏర్పాట్లు చేశారని, ఆ సమయంలో శత్రుమూకలు ఇదేమని ప్రశ్నించారని గుర్తు చేశారు. కుష్టువ్యాధిగ్రస్థుని చికిత్స కోసం తరలిస్తున్నట్లు చెప్పారని, అది నిజమా? కాదా? అని ఆరా తీసే ప్రయత్నంలో కుష్టురోగిని శత్రువులు పిలిచారని, ఆ సమయంలో వేణుగోపాలస్వామి స్వయంగా కుష్టురోగి మాదిరిగా మూలుగుతూ వారికి బదులిచ్చారని, దీంతో శత్రువులు నిజమే అనుకొని కూలీలను విడిచిపెట్టారని వివరించారు. ఆ వేణుగోపాలస్వామి విగ్రహంతోనే బందరులో ఆలయం ఉందని, ఇటీవల తాను దర్శించుకున్నప్పుడు అక్కడ అర్చకులు ఈ నేపథ్యాన్ని చెప్పినప్పుడు కళ్లు చెమర్చిపోయాయని, జన్మ తరించిపోయిందని బేబీనాయన అన్నారు.