Share News

A Tragic Journey విషాద ప్రయాణం

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:22 AM

A Tragic Journey ఆ ముగ్గురూ చిరు వ్యాపారులు. ఇద్దరు ఒకే గ్రామస్థులు కాగా మరొకరు మార్గమధ్యలో వారి ఆటోను ఆశ్రయించాడు. వృత్తులు వేరైనా ప్రవృత్తి ఒకటే కావడం.. ఒకే వాహనంలో ప్రయాణించడం.. విజయనగరం నుంచి గమ్యానికి వెళ్తుండడం కాకతాళీయమే కానీ ముగ్గురూ కలిసి కొద్ది దూరం ప్రయాణించారో లేదో అంతలోనే విధి వక్రీకరించింది.

A Tragic Journey విషాద ప్రయాణం
గుణుపూరు తిరుపతి, తెర్లి ఆదినారాయణ, గుడ్ల రాము ఫైల్‌ఫోటోలు

విషాద ప్రయాణం

ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు చిరు వ్యాపారుల మృతి

శోకసంద్రంలో గజరాయనివలస, పెదమానాపురం

ఆ ముగ్గురూ చిరు వ్యాపారులు. ఇద్దరు ఒకే గ్రామస్థులు కాగా మరొకరు మార్గమధ్యలో వారి ఆటోను ఆశ్రయించాడు. వృత్తులు వేరైనా ప్రవృత్తి ఒకటే కావడం.. ఒకే వాహనంలో ప్రయాణించడం.. విజయనగరం నుంచి గమ్యానికి వెళ్తుండడం కాకతాళీయమే కానీ ముగ్గురూ కలిసి కొద్ది దూరం ప్రయాణించారో లేదో అంతలోనే విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో ముగ్గురినీ ఒకేసారి బలి తీసుకుంది. దత్తిరాజేరు మండలం షికారుగంజి రోడ్డు జంక్షన్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. బాడంగి మండలం గజరాయనివలసకు చెందిన తెర్లి ఆదినారాయణ(55), ఆటో డ్రైవర్‌ గుణుపూరు తిరుపతి(48), దత్తిరాజేరు మండలం పెదమానాపురానికి చెందిన గుడ్ల రాము (48) మృతిచెందారు. బాధితుల బంధువులు, బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

దత్తిరాజేరు/ బాడంగి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి):

బాడంగి మండలం గజరాయనివలసకు చెందిన రైతు కూలీ తెర్లి ఆదినారాయణ(55), ఆటో డ్రైవర్‌ గుణుపూరు తిరుపతి (48) కలిసి మొక్కజొన్న పొత్తుల వ్యాపారం చేస్తున్నారు. రైతులు పండిస్తున్న మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తూ విజయనగరం మార్కెట్‌కు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. రోజులాగే శనివారం మొక్కజొన్నలు కొనుగోలు చేసి రాత్రి విజయనగరం మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడ విక్రయించి ఆదివారం వేకువజామున తిరుగు ప్రయాణమయ్యారు. సుమారు 4 గంటల సమయంలో దత్తిరాజేరు మండలం పెదమానాపురానికి చెందిన గుడ్ల రాము వీరి ఆటోను ఆశ్రయించాడు. రాము గ్రామగ్రామాన తిరిగి ఎండుచేపలు విక్రయిస్తుంటాడు. వ్యాపార రీత్యా తెల్లవారుజామున ఎండు చేపలను విజయనగరంలో కొనుగోలు చేసి దారి మధ్యలో వీరి ఆటో ఎక్కాడు. ఆటో 4.45 గంటల సమయంలో షికారుగంజి జంక్షన్‌కు చేరుకోగా అదే సమయంలో ఎదురుగా రామభద్రపురం వైపు నుంచి విజయనగరం వస్తున్న లారీ అతివేగంగా వస్తూ వీరి ఆటోను ఢీకొంది. ఆపై ఆటోను కొంతదూరం లాక్కెళ్లిపోయింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుయి డ్రైవర్‌ తిరుపతితోపాటు ఆదినారాయణ, రాము అక్కడికక్కడే మృతిచెందారు.

- విషయం తెలుసుకున్న బొబ్బిలి డీఎస్పీ గోవిందరావు, గజపతినగరం సీఐ సన్యాసినాయుడు, స్టేషన్‌ బూర్జవలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం వారివారి స్వగ్రామాలకు మృతదేహాలను చేర్చారు.

మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ముగ్గురూ కుటుంబానికి పెద్దదిక్కు. వారే ఆధారం. కుటుంబాలను పోషించే క్రమంలో వ్యాపారం పనిమీద విజయనగరం వెళ్లి తిరిగి వస్తున్నారు. అంతలోనే తెల్లవారుజామున వారి బతుకులు తెల్లారిపోయాయి. ఆటో డ్రైవర్‌ గుణుపూరు తిరుపతి(48) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య పార్వతి, కుమార్తె దివ్య (7వ తరగతి), కుమారుడు హేమంత్‌(5వ తరగతి) ఉన్నారు. తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలంలు కూడా తిరుపతి వద్దే ఉంటున్నారు. ఆటోపై వచ్చే రాబడి చాలక అదే గ్రామానికి చెందిన ఆదినారాయణతో కలిసి జొన్నపొత్తుల వ్యాపారం చేస్తున్నాడు. ఇక తెర్లి ఆదినారాయణ (55)కు భార్య లక్ష్మి, వివాహితురాలైన కుమార్తె కామేశ్వరితోపాటు కుమారుడు కిశోర్‌ ఉన్నారు. కుటుంబ పోషణలో భాగంగా తిరుపతితో కలిసి జొన్నపొత్తుల వ్యాపారం చేస్తున్నాడు. దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామానికి చెందిన గుడ్ల రాము గ్రామగ్రామాన ఎండు చేపలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయనకు భార్య ఎల్లయ్యమ్మ, డిగ్రీ చదువుతున్న కుమార్తె భవాని, పదో తరగతి చదువుతున్న మరో కుమార్తె దేవి ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోవడంతో తమకు దిక్కెవరని వారంతా భోరున విలపించారు. ఈ ఘటనతో పెదమానాపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

షికారుగంజి జంక్షన్‌లో తరచూ ప్రమాదాలు

దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది మృత్యువాతపడ్డారు. ఎందరో గాయాలపాలయ్యారు. ఈ ప్రాంతంలో పోలీసులు ఎటువంటి హెచ్చరిక బోర్డులుగానీ, ప్రమాదాల నివారణ చర్యలు కాని తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగ్ర్భాంతి చెందిన మంత్రి కొండపల్లి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ దిగ్ర్భాంతి చెందారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పినట్టు టీడీపీ మండల అధ్యక్షుడు చప్ప చంద్రశేఖర్‌ తెలిపారు. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గజరాయనివలసకు చెందిన టీడీపీ నాయకుడు, వైస్‌ ఎంపీపీ పాలవలస గౌరు కూడా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.

Updated Date - Sep 14 , 2026 | 12:22 AM