A teenager's horror attack యువకుడి భయానక దాడి
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:08 AM
A teenager's horror attack మద్యం మత్తులో ఓ యువకుడు భయానకంగా ప్రవర్తించాడు. తాను నివశిస్తున్న వీధిలో అర్ధరాత్రి వేళ వీరంగం సృష్టించాడు. సర్దిచెప్పబోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో ఇద్దరిపై దాడికి దిగాడు. అక్కడితో ఆగకుండా తీవ్రంగా గాయపడి రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మరోమారు దాడిచేసేందుకు ప్రయత్నించాడు.
యువకుడి భయానక దాడి
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై విరుచుకుపడిన వైనం
ఒకరికి కత్తిపోట్లు
రాజాంలో ఘటన
రాజాం రూరల్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ యువకుడు భయానకంగా ప్రవర్తించాడు. తాను నివశిస్తున్న వీధిలో అర్ధరాత్రి వేళ వీరంగం సృష్టించాడు. సర్దిచెప్పబోయిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో ఇద్దరిపై దాడికి దిగాడు. అక్కడితో ఆగకుండా తీవ్రంగా గాయపడి రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిపై మరోమారు దాడిచేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, ఇతరులు అతనిని నిలువరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సంఘటన రాజాం పట్టణంలోని కూరాకుల వీధిలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.
రాజాం కూరాకులవీధిలో ఉంటున్న యువకుడు నల్లా మురళి శుక్రవారం రాత్రి మత్తులో తన ఇంటికి చేరుకుని వీధిలో హల్‌చల్ చేయడం ప్రారంభించాడు. ఇదేమిటని ప్రశ్నించిన కురిటి పద్మపై దాడికి పాల్పడ్డాడు. ‘నా కూతుర్ని ఎందుకు కొడుతున్నావని’ ప్రశ్నించిన కురిటి సత్యన్నారాయణపై కూడా దాడి చేశాడు. తండ్రిని కొడుతుండడంతో పద్మ గట్టిగా కేకలు వేయడంతో ఇంటి డాబాపై ఉన్న పద్మ తమ్ముడు కిరణ్ కిందకు వచ్చి మురళికి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రి, అక్కను మందలించి లోపలికి వెళ్లిపోమని సూచించాడు. దీంతో వివాదానికి పుల్‌స్టాప్ పడిందని వీధివాసులంతా భావించారు. ఇంతలో మురళి చాకు తీసుకుని కిరణ్ ఇంటిలోపలకు వెళ్లి అతని శరీరంపై దొరికినచోటల్లా విచక్షణారహితంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలపాలైన కిరణ్‌ను స్నేహితుడు సాంబ సహాయంతో రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాజాం ఏరియా ఆసుపత్రికి చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న కిరణ్‌పై మురళి మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నం చేశాడు. పోలీసులు, ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నవారంతా అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఉమావెంకటేశ్వర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.