Share News

సాలూరులో రోడ్డు విస్తరణకు ముందడుగు

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:38 PM

సాలూరు పట్టణ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరికైన ప్రధాన రహదారి విస్తరణకు ముందడుగు పడింది.

    సాలూరులో రోడ్డు విస్తరణకు ముందడుగు
ప్రధాన రహదారిపై కొలతలు వేస్తున్న మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు

- 40 నుంచి 60 అడుగులకు పెంపు

- కొలతలు వేసి మార్కింగ్‌ వేసిన అధికారులు

-హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు

సాలూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణ ప్రజలతోపాటు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరికైన ప్రధాన రహదారి విస్తరణకు ముందడుగు పడింది. సాలూరు బోసుబొమ్మ జంక్షన్‌ నుంచి డీలక్స్‌ సెంటర్‌ వరకు రోడ్డు విస్తరణకు మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు గురువారం కొలతలు వేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ప్రధాన రహదారికి మధ్య నుంచి రెండువైపులా చెరో 30 అడుగులు మొత్తంగా రోడ్డును 40 నుంచి 60 అడుగులకు పెంచేలా కొలతలు వేసి మార్కింగ్‌ ఇచ్చారు.

తప్పనున్న ట్రాఫిక్‌ కష్టాలు..

సాలూరు బోసుబొమ్మ కూడలి నుంచి డీలక్స్‌ సెంటర్‌ వరకు ప్రధాన రహదారికి ఆనుకొని ఇరువైపులా దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, హోటళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని అనధికారికంగా నిర్మించడంతో రహదారి పూర్తిగా కుచించుకుపోయింది. దీంతో విజయనగరం నుంచి సాలూరు వచ్చే వాహనాలు, సాలూరు నుంచి ఒడిశా వెళ్లే వాహనాలతో నిత్యం రహదారి రద్దీగా మారుతుంది. చిన్నపాటి పండుగ వచ్చినా పరిసర గ్రామాలకు చెందిన అనేకమంది గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు సైతం నిత్యవసరాల కొనుగోళ్లకు పట్టణానికి వస్తుంటారు. దీంతో కొన్నిసార్లు ట్రాఫిక్‌ నిలిచిపోతుంటుంది. రహదారిపై వాహనాలు నడిపేందుకుగానీ, నడిచి వెళ్లేందుకుగానీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ప్రమాదాల బారినపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో ట్రాఫిక్‌ కష్టాలు తప్పనున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, రహదారిని 40 నుంచి 60 అడుగుల వెడల్పుగా మార్చేందుకు మార్కింగ్‌ వేయడంతో షాపుల యజమానుల్లో ఆందోళన మొదలైంది.

మార్కింగ్‌ చేస్తున్నాం..

సాలూరు ప్రత్యేకాధికారి, జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా బోసుబొమ్మ కూడలి నుంచి డీలక్స్‌ సెంటర్‌ వరకు ప్రధాన రహదారిని విస్తరించనున్నాం. రోడ్డును 40 నుంచి 60 అడుగుల వెడల్పు చేయను న్నాం. ఈ మేరకు కొలతలు వేసి మార్కింగ్‌ ఇచ్చాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపడతాం.

-టీటీ రత్నకుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌, సాలూరు

Updated Date - Mar 26 , 2026 | 11:38 PM