Share News

ఆధ్యాత్మిక యాత్ర.. విషాదం కారాదు

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:22 AM

ఆధ్యాత్మిక యాత్రలు కొన్నిసార్లు విషాదాలుగా మారుతున్నాయి. జిల్లాలో భవానీ, అయ్యప్ప మాలలను ధరించేవారు ప్రతిఏటా పెరుగుతున్నారు.

ఆధ్యాత్మిక యాత్ర.. విషాదం కారాదు
కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భవాని భక్తులు(ఫైల్‌)

- రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న భక్తులు

- శబరిమలకు రవాణా సౌకర్యం అంతంతే

- ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్న వైనం

- ప్రత్యేక రైళ్లు నడపాలని భక్తుల వినతి

- ఈ నెల 22న కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు భవానీ భక్తులు దుర్మరణం చెందారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్న భక్తులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురూ మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతులు, బాధితులంతా డెంకాడ వాసులే.

- గత ఏడాది డిసెంబరులో తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా లారీ ఢీకొంది. దీంతో కారులో ఉన్న నలుగురూ చనిపోయారు.

రాజాం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక యాత్రలు కొన్నిసార్లు విషాదాలుగా మారుతున్నాయి. జిల్లాలో భవానీ, అయ్యప్ప మాలలను ధరించేవారు ప్రతిఏటా పెరుగుతున్నారు. అయితే, వీరంతా మాల విసర్జన కోసం విజయవాడ, శబరిమలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం తక్కువగా ఉంటుంది. దీంతో కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా, మరికొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. చివరకు చిన్నచిన్న వాహనాల్లో సైతం పయనమవుతున్నారు. ఈక్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా కార్తీక మాసంలో జిల్లాలో సుమారుగా 30 వేల మందికిపైగా భక్తులు అయ్యప్ప మాలధారణ చేపడతారు. మకర సంక్రాంతి వరకూ 41 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగుతాయి. అయితే, దీక్ష విరమణ కోసం శబరిమలకు వెళ్లేందుకు రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఎక్కువ మంది బస్సులు, కార్లలో వెళ్తుంటారు. ఈ మూడు నెలల వ్యవధిలోనే జిల్లా నుంచి 300 నుంచి 500 వరకూ బస్సులు, మరో 1000 వరకూ ప్రైవేటు వాహనాలు శబరిమల వెళుతుంటాయని అంచనా. జిల్లా నుంచి శబరిమలకు దాదాపు 1400 కిలోమీటర్ల ఉంటుంది. ఒకవైపు ప్రయాణానికి 30 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది 7 సీట్ల కారును ఆశ్రయిస్తున్నారు. అన్ని గంటల పాటు ప్రయాణం అంటే కచ్చితంగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఒకవైపు కఠిన దీక్ష, నిద్రలేమి, ఆహారం సక్రమంగా ఉండకపోవడం, పొగమంచు తదితర కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.

చాలీచాలని రైళ్లు..

నవంబరు 16 నుంచి డిసెంబరు 27 వరకూ, డిసెంబరు 30 నుంచి జనవరి 20 వరకూ శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరిచే ఉంటుంది. మకర జ్యోతి కోసం జిల్లా నుంచి వేలాది మంది భక్తులు వెళుతుంటారు. కానీ, విశాఖ నుంచి మాత్రమే శబరిమలకు ప్రత్యేక రైళ్ల సర్వీసులు నడుపుతున్నారు. కానీ, ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వెళుతున్న భక్తులతో ఈ ప్రత్యేక రైళ్లు చాలడం లేదు. శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసినా జిల్లా భక్తులకు అవకాశం లేదు. దీంతో ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వేశాఖ స్పందించి నేరుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడపాలని అయ్యప్ప భక్తులు కోరుతున్నారు.

ప్రత్యేక రైళ్లు నడపాలి..

శబరిమల యాత్రలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రైల్వేశాఖ స్పందించి జిల్లా నుంచి ప్రత్యేక రైలు సర్వీసులను నడపాలి. విజయనగరం నుంచి నేరుగా నడిపితే జిల్లావాసులకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవచూపాలి.

నంది సూర్యప్రకాష్‌రివు, అయ్యప్ప గురుస్వామి, రాజాం

రవాణా మెరుగుపరచాలి

దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ జిల్లా నుంచి శబరిమలకు చేరుకోలేం. అటువంటిది ఎంతో నిష్టతో శబరిమలకు వెళ్లే క్రమంలో రవాణా సదుపాయం మెరుగైనదిగా ఉండాలి. ఈ విషయంలో రైల్వేశాఖ స్పందించి అదనపు సర్వీసులను నడిపితే బాగుంటుంది.

-టంకాల పాపినాయుడు, అయ్యప్ప గురుస్వామి, రాజాం

Updated Date - Oct 24 , 2026 | 12:22 AM