Share News

పీజీఆర్‌ఎస్‌తో సమస్యలకు మోక్షం

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:11 AM

కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)తో చాలామంది బాధితులకు న్యాయం జరుగుతుంది.

పీజీఆర్‌ఎస్‌తో సమస్యలకు మోక్షం
కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ వద్ద బారులు తీరిన అర్జీదారులు (ఫైల్‌)

- బాధితులకు దొరుకుతున్న న్యాయం

- అర్జీలు ఇచ్చేందుకు బారులు

- కొంతమంది అధికారులతో ప్రభుత్వానికి చెడ్డపేరు

- రాష్ట్ర, జిల్లా విభాగాల నుంచి అర్జీదారులకు ఫోన్‌ కాల్స్‌

- తప్పుడు ఎండార్స్‌మెంటు ఇస్తున్న వారిపై చర్యలు

- శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్య నిపుణులు ప్రైవేటుగా వైద్య సేవలు, కన్సల్టేషన్‌ నిర్వహిస్తున్నట్లు ఇటీవల కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు అందింది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులను ఆ వైద్యులు ప్రైవేటుకు తీసుకుపోతున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దీనిపై జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త చర్యలకు ఉపక్రమించారు. గజపతినగరం, నెల్లిమర్ల ఆసుపత్రి నుంచి ఇద్దరు వైద్యులు, ఇద్దరు నాన్‌ మెడికల్‌ సిబ్బందితో విచారణ కమిటీని నియమించారు. ఆ వైద్యుల పనితీరుపై ఇప్పటికే విచారణ కమిటీ నివేదికను అందించింది.

- ఎస్‌.కోట మండలం ముషిడిపల్లి గ్రామ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యులు భారీ లేఅవుట్‌ వేశారు. ఆ లేఅవుట్‌కు నిర్మించిన రోడ్డులో రెండు సాగునీటి బందల్లోని కొంత భాగాన్ని కలిపేసుకున్నారు. దీనిపై అప్పట్లో ఆ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఫిర్యాదులు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ లేఅవుట్‌ రోడ్డుపై కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదు అందింది. వెంటనే మండల రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డును తొలగించారు.

శృంగవరపుకోట, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)తో చాలామంది బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ పలు సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది. అయితే, కొంత మంది అధికారులు, సిబ్బంది తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతులను పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కారం చూపలేకపోతే దానికి గల కారణాలను అర్థమయ్యే రీతిలో అర్జీదారులకు వివరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయంలో పలువురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అర్జీదారులకు మాయమాటలు చెబుతున్నారు. సమస్య పరిష్కారంపై సంతృప్తి చెందినట్లు వారితో సంతకాలు తీసేసుకుంటున్నారు. దీన్ని నిర్ధారించేందుకు రాష్ట్ర, జిల్లా విభాగాల నుంచి ఫిర్యాదుదారులకు ఫోన్‌లు వస్తున్నాయి. అయితే, సమస్య పరిష్కారంపై ఫిర్యాదుదారులు ఫోన్‌లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు అధికారుల పనితీరుపై చులకనగా మాట్లాడుతున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. బాధ్యతగా వ్యవహరించని అధికారులు, సిబ్బందిపై చర్యలకు దిగుతుంది. జిల్లాలో అర్జీదారులకు తప్పుడు ఎండార్స్‌మెంట్‌లు ఇచ్చిన ఓ గ్రామ రెవెన్యూ అధికారితో పాటు ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు, సిబ్బందిలో భయంపట్టుకుంది.

రెండోసారి ఫిర్యాదు చేయొచ్చు..

అధికారుల తప్పుడు సమాచారంతో ఆసంతృప్తి చెందిన అర్జీదారులు తిరిగి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయొచ్చు. దీన్ని సంబంధిత అధికారులు తిరిగి రిఓపెన్‌ చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుంటే వారే నేరుగా రీ ఓపెన్‌ చేసుకునేందుకు వెసులుబాటుంది. దీంతో కోర్టు కేసులు, కుటుంబ తగాదాలు వంటి వాటిల్లో తప్ప మిగిలిన సమస్యలకు దాదాపుగా పరిష్కార మార్గం దొరుకుతుంది. సమస్యలకు పరిష్కారం చూపడం ద్వారా ప్రజల్లో సంతృప్తిస్థాయిని పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సమస్యలను న్యాయంగా పరిష్కారం చూపేందుకు పార్టీలకు అతీతంగా వెళ్తుంది.

Updated Date - Oct 11 , 2026 | 12:11 AM