A setback for the YSRCP వైసీపీకి ఎదురుదెబ్బ
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:47 PM
A setback for the YSRCP పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఝలక్ తగిలింది. కోలుకోలేని అపజయం ఎదురైంది. టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 27 జడ్పీటీసీలకుగాను 22 చోట్ల కూటమి విజయం సాధించింది.
వైసీపీకి ఎదురుదెబ్బ
22 జడ్పీటీసీలతో జడ్పీ పీఠం టీడీపీ సొంతం
ఏ దశలోనూ నిలబడలేకపోయిన ఫ్యాన్ పార్టీ
ఐదు స్థానాలకే పరిమితం
అక్కడా తక్కువ మెజార్టీతో గట్టెక్కిన వైనం
గుర్ల, గరివిడి మండలాల్లో పట్టు నిలుపుకున్న బొత్స
బొండపల్లిలో కుమార్తె ఓటమి
పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఝలక్ తగిలింది. కోలుకోలేని అపజయం ఎదురైంది. టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 27 జడ్పీటీసీలకుగాను 22 చోట్ల కూటమి విజయం సాధించింది. వైసీపీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీకి 20 స్థానాలు వచ్చాయి. జనసేన మరో 2 చోట్ల గెలుపొందింది. వైసీపీకి బలమైన ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. చీపురుపల్లి నియోజకవర్గంలో రెండు జడ్పీటీసీలు వైసీపీకి చిక్కడం ఆ పార్టీతో పాటు బొత్స సత్యనారాయణకు కొంత ఉపశమనం.
విజయనగరం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ పోరులోనూ పునరావృతం అయ్యాయి. కూటమి పాలనకే ప్రజలంతా జై కొట్టారు. ఏ దశలోనూ ఫ్యాన్ పార్టీ నిలబడలేకపోయింది. ఐదు చోట్లకే పరిమితమైంది. జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బొండపల్లి నుంచి బరిలో నిలిచిన బొత్స కుమార్తె డాక్టర్ అనూష భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆ కుటుంబానికి షాక్ తగిలినట్టు అయ్యింది. అదే సమయంలో గరివిడి నుంచి బొత్స కోడలు, గుర్ల నుంచి సోదరి వెంకటలక్మి గెలవడం కాస్త ఊరటగా మిగిలాయి. అందునా గరివిడిలో చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు కోడలు సంధ్యపై బొత్స కోడలు గెలవడం ఒక విధంగా కళా వెంకటరావుకు కూడా షాకింగ్ పరిణామమే. నెల్లిమర్లలో ఒకటి, గజపతినగరం నియోజకవర్గంలో ఒకటి, ఎస్.కోట నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ స్థానాలను టీడీపీ కూటమి కోల్పోయింది. ఆయా చోట్ల కూటమిలో సమన్వయ లోపమే వైసీపీ నిలబడేందుకు కారణమైంది.
స్వల్ప మెజారిటీయే
జామిలో వైసీపీ అభ్యర్థి ఎర్ని తులసీ త్రివేణి సమీప జనసేన అభ్యర్థి చిప్పాడ నాగరాజుపై 593 ఓట్లతో, గుర్లలో వైసీపీ అభ్యర్థి సంగంరెడ్డి వెంకటలక్ష్మి టీడీపీ అభ్యర్థిపై 289 ఓట్లతో, గజపతినగరంలో వైసీపీ అభ్యర్థి సూర్యకళ బీజేపీ అభ్యర్థి రెడ్డి పావనిపై 1848 ఓట్లతో, నెల్లిమర్లలో వైసీపీ అభ్యర్థి మత్స్య విజయ సమీప బీజేపీ అభ్యర్థి యడ్ల గోవిందరావుపై 1231 ఓట్లతో, గరివిడిలో వైసీపీ అభ్యర్థి పూజిత సమీప టీడీపీ అభ్యర్థి సంధ్యపై 1611 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మిగతా చోట్ల టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలు నమోదుచేసుకున్నారు. వైసీపీ గెలిచిన ఐదు చోట్ల తక్కువ మెజార్టీ రాగా.. టీడీపీ అభ్యర్థులు మాత్రం ప్రత్యర్థులకు అందనంతగా విజయాన్ని చేజెక్కించుకున్నారు. రేగిడి టీడీపీ అభ్యర్థి పాలవలస పుష్పవతి అత్యధికంగా 10,664 ఓట్ల మెజార్టీ సాధించడం విశేషం.
ఆ పార్టీకి ఎదురుదెబ్బే
జిల్లాలో సగానికిపైగా స్థానాలను గెలిచి జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ చూసింది. అందుకే బొత్స సత్యనారాయణ కుమార్తెను జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దించారు. కానీ బొండపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా ఆమె దారుణ పరాజయం చవిచూశారు. ఇటు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూడా 300 గ్రామాలు కూటమి ఖాతాలో పడ్డాయి. వైసీపీ కేవలం 103 స్థానాలకే పరిమితమైంది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి బొండపల్లిలో కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. రాజాం, వంగర, ఎల్,కోట మండలాల్లో వైసీపీకి ఒక్కోస్థానం వచ్చింది. గజపతినగరం, గంట్యాడ, మెరకముడిదాం మండలాల్లో రెండేసి స్థానాలు దక్కాయి. మిగతా మండలాల్లో నామామాత్రంగానే సీట్లు దక్కించుకుంది. ఏ దశలోనూ వైసీపీ అధికార కూటమికి ఎదురు నిలబడలేకపోయింది. జడ్పీటీసీలలో ఐదు స్థానాలతో సరిపెట్టుకోగా.. ఎంపీటీసీల పరంగా మాత్రం ఘోరంగా ఓటమి చవిచూసింది. టీడీపీ కూటమి అభ్యర్థులకు అన్ని మండలాల్లో 2 వేల నుంచి 10 వేల వరకూ మెజార్టీలు రావడంతో వైసీపీ నేతలు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.
ఆ ఒక్కచోట మాత్రమే..
టీడీపీ కూటమి జిల్లాపరంగా ఊడ్చేసింది. కానీ చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతికూల ఫలితాలనిచ్చింది. ఈ నియోజకవర్గంలో గరివిడి, గుర్ల జడ్పీటీసీలను వైసీపీ చేజిక్కించుకుంది. టీడీపీ చీపురుపల్లి, మెరకముడిదాం మండలాలకు మాత్రమే పరిమితమైంది. వాస్తవానికి చిన్న శ్రీను ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో జిల్లా మొత్తం ప్రభావం చూపింది. కానీ చీపురుపల్లి నియోజకవర్గంలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఆ నాలుగు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలను దాదాపుగా నిలబెట్టుకుంది.
-------------------------