Tourism Development! పర్యాటకాభివృద్ధికి మోకాలడ్డు!
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:07 AM
A Roadblock to Tourism Development! కూటమి ప్రభుత్వం సీతంపేటలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా.. అటవీశాఖ మాత్రం మోకాలడ్డుతోంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా ఆశాఖాధికారులు సహకరించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
సహకరిస్తే.. పర్యాటక హబ్‌గా సీతంపేట మన్యం
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు
సీతంపేట రూరల్, జనవరి 5(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో ప్రకృతి సహజసిద్ధ అందాలకు కొదవలేదు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, జలపాతాలు, పచ్చని చెట్లతో ఈ ప్రాంతం మరో ఊటీ, అరకు వంటి ప్రాంతాలను తలపిస్తోంది. అందుకే ఇక్కడకు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతుంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం సీతంపేటలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా.. అటవీశాఖ మాత్రం మోకాలడ్డుతోంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. మొత్తంగా ఆశాఖాధికారులు సహకరించకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
సీతంపేట ఏజెన్సీలో పొల్ల వ్యూపాయింట్‌తో పాటు బెన్నరాయి, సున్నపుగెడ్డ జలపాతాలు రిజర్వుఫారెస్ట్(ఆర్‌ఎఫ్)లో ఉన్నాయి. అయితే అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో ఐటీడీఏ అక్కడ ఏ పనులూ చేపట్టలేకపోతోంది. దీంతో గడిచిన కొన్నేళ్లుగా ఆయా ప్రాంతాలు అభివృద్థికి నోచుకోవడం లేదు. ఏడాది కిందట సున్నపుగెడ్డ జలపాతం ప్రధాన ముఖద్వారం వద్ద అటవీశాఖ ఆధికారులు ఉడెన్‌తో ఆర్చ్‌ను తయారు చేశారు. ఆ ప్రాంతంలో ఉడెన్ బెంచీలను ఏర్పాటు చేశారు. అయితే మిగిలిన పనులు ఇంకా ప్రారంభించలేదు. మరోవైపు సరైన రహదారి సౌకర్యం కూడా లేక.. సున్నపుగెడ్డ జలపాతాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇదిలా ఉండగా ఆర్‌ఎఫ్‌లో ఉన్న బెన్నరాయి జలపాతం అందాలను తీర్చిదిద్దేందుకు అటవీ శాఖ నుంచి ఐటీడీఏకు క్లియరెన్స్ రాలేదు. అయితే కలెక్టర్, సీతంపేట ఐటీడీఏ చైర్మన్ ఆదేశాల మేరకు బెన్నరాయి జలపాతం వద్ద ట్రెక్కింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. మరికొద్ది రోజుల్లో తాత్కాలిక రహదారిని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. పొల్ల వ్యూపాయింట్‌ను కూడా ఇటీవలే ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పరిశీలించారు.
అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాలు
సీతంపేట మన్యంలో అభివృద్థి చేయాల్సిన పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా బెన్నరాయి, పీజీ ఈతమానుగూడ, మల్లెమ్మతల్లి కొండ ప్రాంతంలో ఉన్న కొన్ని జలపాతాల వద్ద మౌలిక వసతులు కల్పిస్తే.. ఈ ప్రాంతం పర్యాటక హబ్‌గా మారనుంది. అంతేకాకుండా పొల్ల వ్యూపాయింట్, తుంభకొండ ప్రాంతంలో ఉన్న పిన్నమ్మ, పెద్దమ్మతల్లి కొండ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్థి చేయాల్సిన అవసరం ఉంది. మన్యంలోని పర్యాటక ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్థి జరిగితే గిరిజన యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ అడ్వంచర్‌పార్క్, ఆడలి వ్యూపాయింట్, మెట్టుగూడ జలపాతం వద్ద అధిక శాతం మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఐటీడీఏ ద్వారా కొత్తగా గుర్తించిన పర్యాటక ప్రాంతాలు అభివృద్థి జరిగితే మరికొంతమందికి ఉపాధి అవ కాశాలు దొరకనున్నాయి.
ఐటీడీఏ ఆధ్వర్యంలో పనులు ఇలా ..
ఆదివాసీల గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలు ప్రతిబింబించేలా పీఎంఆర్‌సీలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియంను మంగళవారం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక గిరిశిఖర ప్రాంతంలో ఉన్న జగతిపల్లి వ్యూపాయింట్ అందాలను పర్యాట కులకు మరింత చేరువ చేసేందుకు ఐటీడీఏ అధికారులు పనులు చేపడుతున్నారు. గతంలో ఇక్కడ రిసార్ట్స్ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం రూ.7కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో అప్పట్లో కొంతమేర పనులు చేపట్టారు. అనంతరం వైసీపీ వచ్చిన తర్వాత సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలుపంపారు. అయితే నిధులు మంజూరయ్యే లోగా జగతిపల్లిలో సెల్ఫీ, ఫొటోషూట్ పాయింట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వ్యూపాయింట్ ప్రవేశ ద్వారం వద్ద పర్యాటకులకు స్వాగతం పలుకేందుకు వెదురు, చెక్కలతో ఉడెన్ ఆర్చ్ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తిచేశారు. దీనిపై ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌ను వివరణ కోరగా.. ‘సీతంపేట ఐటీడీఏ పరిధిలో కొత్తగా గుర్తించిన పర్యాటక ప్రాంతాలను ఇప్పటికే పరిశీలించాం. వాటి అభివృద్ధికి ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై యోచిస్తున్నాం. అటవీశాఖ అభ్యంతరాలపై ప్రభుత్వానికి నివేదిస్తాం.’ అని తెలిపారు.