Share News

పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:12 AM

సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వడంతోపాటు పశువుల పెంపకానికి ప్రత్యామ్నాయం చూపిస్తేనే భూములు ఖాళీ చేస్తామని గ్రామస్థులు స్పష్టంచేశారు.

పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి
నిరసన తెలుపుతున్న సారిపల్లి గ్రామస్థులు

నెల్లిమర్ల, జూలై 22(ఆంధ్రజ్యోతి): సారిపల్లి గ్రామానికి పునరావాస ప్యాకేజీ ఇవ్వడంతోపాటు పశువుల పెంపకానికి ప్రత్యామ్నాయం చూపిస్తేనే భూములు ఖాళీ చేస్తామని గ్రామస్థులు స్పష్టంచేశారు. సారిపల్లిలోని కొండపక్క ఖాళీ స్థలా ల్లో గ్రామస్థులు పశువులు మేపుకొని జీవనం సాగిస్తుండగా బుధవారం హుటా హుటిన తారకరామ సాగర్‌ ప్రాజెక్టు అధికారులు స్థలాలు ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో వారు నిరసనకు దిగారు. ఈసందర్భంగా మాజీ సర్పంచ్‌ రాయి విభీషణరావు మాట్లాడుతూ కొద్దేళ్లుగా గ్రామానికి పునారావాస ప్యాకేజీ కోసం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వాలు మారినా ప్యాకేజీ దక్కలేదని తెలిపారు. కొద్దేళ్లుగా కొండపక్కన స్థలంలో పశువుల శాల ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నా ప్రాజెక్టు అధికారులు ఖాళీ చేయమనడం దారుణమన్నారు. ఇప్పటికే పలుసార్లు గ్రామానికి ప్యాకేజీ అమలుచేయాలని, రక్షణ గట్టు డిజైన్‌ మార్చాలని కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సారిపల్లికి పునరావాస ప్యాకేజీ వస్తుందని ఆశపడ్డామని తెలిపారు. ఆర్‌ఆర్‌ప్యాకేజీ అమలు చేసి, పశువులు పెంపకానికి ప్రత్యామ్నాయం చేయక పోతే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మజ్జి త్రివే ణి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:12 AM