A Polio-Free Society పోలియో రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Jun 29 , 2026 | 12:15 AM
A Polio-Free Society Is the Goal పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరు డబ్బీవీధి కేహెచ్ స్కూల్‌లోని కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు.
సాలూరు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరు డబ్బీవీధి కేహెచ్ స్కూల్‌లోని కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు లక్షమంది చిన్నారులకు చుక్కల మందు వేయడమే లక్ష్యంగా 905 పోలియో బూత్‌లు, 19 ట్రాన్సిట్, 42 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. 29, 30 తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటీకి వెళ్లి చిన్నారులకు చుక్కల మందు వేయనున్నారని వెల్లడించారు. ఇందుకోసం 1810 బృందాలు పనిచేస్తాయన్నారు. 209 హైరిస్క్ ప్రాంతాల్లో 3,645 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి చర్యలు చేపట్టామని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మొత్తంగా 1,21,398 బీవోపీవీ డోసులు అందుబాటులో ఉంచామన్నారు. 3620 మంది వ్యాక్సినేటర్లు, 93 మంది సూపర్‌వైజర్లు విధులు నిర్వహిస్తుండగా.. వ్యాక్సిన్ నాణ్యతను కాపాడేందుకు 46 కోల్డ్‌చైన్ యూనిట్లు సిద్ధంగా ఉంచామని చెప్పారు.
97 శాతం పూర్తి
పార్వతీపురం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 97 శాతం వరకు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశామని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. మిగిలిన మూడు శాతం సోమవారానికి పూర్తి చేస్తామని వెల్లడించారు.