Share News

A Place of Honor for Women అతివలకు అగ్రపీఠం

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:40 PM

A Place of Honor for Women కార్పొరేషన్‌, పురపాలక సంఘాల ఎన్నికల క్రతువులో తొలి అడుగు పడింది. ముందు నుంచీ చెబుతున్నట్టే మహిళలకే కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. ఇచ్చిన మాటప్రకారం 33 శాతం అమలయ్యేలా రిజర్వేషన్లు కేటాయించడంపై నారీమణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

A Place of Honor for Women అతివలకు అగ్రపీఠం

అతివలకు అగ్రపీఠం

విజయనగరం కార్పొరేషన్‌, రెండు మున్సిపాలిటీలలో కొలువుదీరనున్న మహిళలు

33 శాతం సీట్లు వారికే

హామీ నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం

రిజర్వేషన్లు ఖరారు

మేయర్‌ సీటు ఎన్నిక రసవత్తరం

కార్పొరేషన్‌, పురపాలక సంఘాల ఎన్నికల క్రతువులో తొలి అడుగు పడింది. ముందు నుంచీ చెబుతున్నట్టే మహిళలకే కూటమి ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. ఇచ్చిన మాటప్రకారం 33 శాతం అమలయ్యేలా రిజర్వేషన్లు కేటాయించడంపై నారీమణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారికి ప్రతిరూపంగా మహిళా శక్తికి తార్కాణంగా శరన్నవరాత్రులు జరుపుకుంటున్న నేపథ్యంలో అతివలకు అగ్రపీఠం కల్పిస్తూ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని సంకేతం పంపింది. దీంతో నారీలోకం ఆనందోత్సాహాలతో ఉద్యుక్తులవుతోంది.

విజయనగరం/ కంటోన్మెంట్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

స్థానిక ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. న్యాయపరమైన చిక్కుముళ్లు వీడడంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ రానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు అంతిమ దశకు చేరింది. 14న ప్రకటన రానున్నట్టు ప్రచారం నడుస్తోంది. ముందుగా మునిసిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో అందరి దృష్టి విజయనగరం కార్పొరేషన్‌పై ఉంది. ఈ సారి మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించ నుండడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది. బహుముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాన పోటీ అధికార కూటమి వర్సెస్‌ వైసీపీ అన్నట్టుగా ఉండొచ్చు. అటు కాంగ్రెస్‌తో పాటు ఇతర ఇండిపెండెంట్‌ అభ్యర్థులు సైతం ఈసారి రంగంలోకి దిగే అవకాశం ఉంది.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గానికి క్షత్రియులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. జిల్లా మంత్రిగా తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు. ఆపై డీసీసీబీ చైర్మన్‌గా తూర్పుకాపు సామాజికవర్గానికి చెందిన కిమిడి నాగార్జున ఉన్నారు. విజయనగరం ఎంపీగా అదే సామాజికవర్గానికి చెందిన కలిశెట్టి అప్పలనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే ఈసారి విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌తో పాటు జడ్పీ పీఠానికి సంబంధించి ఇతర బీసీ సామాజికవర్గాలకు చెందిన వారికి అవకాశం దక్కుతుందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికైతే ఇది బీసీలకు జాక్‌పాట్‌ అనే చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు వైసీపీలో మాత్రం బీసీల నుంచి సరైన అభ్యర్థి ఎవరూ కనిపించడం లేదు. జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కావడంతో...మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి రంగంలోకి దిగుతారని సమాచారం. గత నగరపాలక సంస్థ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్‌గా ఉండడంతో శ్రావణి అయితే కొంతవరకూ నెగ్గుకురాగలరని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఆశావాహులు అధిక సంఖ్యలో వున్నారు..

డివిజన్ల రిజర్వేషన్‌పై ఉత్కంఠ !

విజయనగరం నగర పాలక సంస్థ మేయర్‌ పదవికి రిజర్వేషన్‌ అధికారికంగా ప్రకటించారు. 62వార్టులకు సంబంధించి సోమావరం రాత్రి వరకు రిజర్వేషన్లు ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంట నెలకొంది. మరోవైపు అధికారులు కూడా కలెక్టరేట్‌లో రాత్రి వరకు వేచి ఉన్నారు. మంగళవారం డివిజన్ల వారీగా రిజర్వేషన్లు అధికారకంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఫ కూటమి ప్రభుత్వం సూపర్‌-6 పథకం హామీలో భాగంగా మహిళలకు పెద్దపీట వేసింది. స్త్రీ శక్తిపథకంతో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఏడాదికి ఉచిత 3 గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ, డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆర్ధిక సుస్థిరత కోసం రుణాల మంజూరు, తల్లికి వందనం, పక్కా గృహనిర్మాణ పథకం మహిళల పేరుతో అమలు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూడా వారికి 33 శాతం రిజర్వేషన్‌ కల్పించి మరింతగా ప్రోత్సహిస్తోంది. జిల్లాలోని నాలుగు స్థానిక సంస్థల్లో మూడు వారికే కేటాయించింది.

రిజర్వేషన్లు ఇలా....

జిల్లాలో విజయనగరం కార్పొరేషన్‌తోపాటు బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీలు ఉన్నాయి. విజయనగరం కార్పొరేషన్‌ (మహిళ జనరల్‌), బొబ్బిలి మున్సిపాలిటీ (మహిళ జనరల్‌), రాజాం మున్సిపాలిటీ(బీసీ మహిళ), నెల్లిమర్ల నగర పంచాయతీ(బీసీ జనరల్‌) కేటాయించారు. నాలుగింటిలో విజయనగరం, బొబ్బిలి, రాజాంలో నేరుగా మహిళలు ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం దక్కింది. మిగిలిన నెల్లిమర్ల నగర పంచాయతీ బీసీ జనరల్‌కు కేటాయించినా స్థానిక సమీకరణలకు అనుగుణంగా మహిళకు అవకాశం వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

వార్డు రిజర్వేషన్లు ఇలా..

- బొబ్బిలి మున్సిపాలిటిలో 36 వార్డులు ఉండగా ఎస్టీ జనరల్‌ - 1, ఎస్సీ జనరల్‌ - 2, ఎస్సీ మహిళ- 2, బీసీ జనరల్‌ - 7, బీసీ మహిళ - 6, జనరల్‌ మహిళ 10, అన్‌ రిజర్వుడ్‌ 8 ఉన్నాయి.

- నెల్లిమర్ల నగర పంచాయతీలో 23 వార్డులు ఉన్నాయి. ఎస్టీజనరల్‌ - 1, ఎస్సీ జనరల్‌- 1, ఎస్సీ మహిళ- 1, బీసీ జనరల్‌- 4, బీసీ మహిళ- 4, జనరల్‌ మహిళ- 6, అన్‌ రిజర్వుడ్‌లో- 6 ఉన్నాయి.

-------------

Updated Date - Oct 12 , 2026 | 11:40 PM