Share News

అతివకు అందలం

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:34 AM

పురపోరులో అతివకు అందలం దక్కింది. విజయనగరం కార్పొరేషన్‌లో సగానికి పైగా పీఠాలు మహిళలకే దక్కాయి.

అతివకు అందలం

- విజయనగరం కార్పొరేషన్‌లో సగానికి పైగా పీఠాలు మహిళలవే

- 62మంది కార్పొరేటర్లలో 34మంది వారే

విజయనగరంటౌన్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పురపోరులో అతివకు అందలం దక్కింది. విజయనగరం కార్పొరేషన్‌లో సగానికి పైగా పీఠాలు మహిళలకే దక్కాయి. జనరల్‌కు రిజర్వుడు అయిన స్థానాలను సైతం వారే అధిష్టించడం విశేషం. నగరంలో 62 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిం చగా అందులో 34 డివిజన్లలో మహిళలే విజయం సాధించారు. టీడీపీ మేయర్‌ అభ్యర్థి అవనాపు భార్గవితో పాటు చదురు పార్వతి(1వ డివిజన్‌), గొంప స్వప్న(2వ డివిజన్‌), గొర్లె రమా(4), కోరాడ రాజు(6), గొలగాని మీనాకుమారి(7), పొట్నూరు మనీషా(9), రవ్వా మంజు (11), కళ్ల రూపా(13), తాడ్డి భగవతి(15), అల్లు నాగమణి(16), భాగ్యలక్ష్మి గుజ్జల(17), సోడిపిల్లి భూదేవి(18), షేక్‌ సాజాది భేగం(19), పిలకాదేవి (20), భోగాపురపు అనూషా(23), భోగాపురపు రమా(24), ప్రసాదుల రజనీ(25), బర్ల సత్యవేణి(27), ద్వాదశి సుమతి(28), ముక్కమల ఉమ(29), గురాన రాధిక(30), మెట్ట సుజాత(31), దుప్పాడ సునీత(34), అడారి విజయలక్ష్మి(38), గంట చిన్నమ్మలు(44), తోగురోతు సంధ్యారాణి(45), రాయపాటి అరుణ(46), పిన్నింటి కళావతి(48), పడాల అనూష(49), యాళ్ల తనూజ(50), అక్రబాని అనిత(52), కోండ్రు రాజప్రసన్నవర్ధని (55వ డివిజన్‌), కర్రోతు రాధామణి (60వ డివిజన్‌) విజయం సాధించారు. వీరిలో చాలామంది మొదటిసారి విజయం సాధించిన వారే. కొంతమందికి ఆయా డివిజన్లలో ప్రకటించిన రిజర్వేషన్‌ వల్ల అనుకోకుండా పోటీచేసే అవకాశం దక్కింది. విజయం కూడా వరించడంతో వారి ఆనందం వర్ణించలేనంతగా మారింది. గెలిచిన మహిళా కార్పొరేటర్లందరూ తమ డివిజన్‌ల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

నా విజయాన్ని నా డివిజన్‌ ప్రజలకు అంకితం చేస్తున్నాను. రాజకీయంలో అంతగా అనుభవం లేకపోయినా ఐక్యతతో కౌన్సిల్‌ను ముందుకు తీసుకువెళ్తా. నా కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌లో పూర్తిస్థాయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచినందుకు ఆనందంగా ఉంది.

-అక్రబాని అనిత, 52వ డివిజన్‌ కార్పొరేటర్‌

పారదర్శక పాలన అందిస్తా

డివిజన్‌లోని ప్రధాన సమస్యలను గుర్తిస్తా. పారదర్శకమైన పాలన అందిస్తా. మొదటిసారి కార్పొరేటర్‌గా విజయం సాధించడంలో కుటుంబ సభ్యులు, వార్డు ప్రజలు అందించిన సహకారం మరువలేనిది. ఎమ్మెల్యే సహకారంతో డివిజన్‌ అభివృద్ధికి కృషిచేస్తా.

-గొంప స్వప్న, 2వ డివిజన్‌ కార్పొరేటర్‌

Updated Date - Nov 14 , 2026 | 12:34 AM