వివాదాల ‘కొండ’
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:30 AM
విజయనగరానికి కూతవేటు దూరంలో ఉన్న కొండకరకాం కొండ అధికారపార్టీ నేతల మధ్య విభేదాలకు కారణమవుతుందా?..
- కొండకరకాంలో రెండు క్వారీలకు అనుమతి
- అభ్యంతరం చెబుతున్న కొందరు వ్యక్తులు
- వైసీపీ హయాంలో నోరు మెదపని వైనం
- కొండను తవ్వితే ఆలయానికి ముప్పు
- ఉపాధి పనులు దూరమవుతాయి
- ఆందోళన చెందుతున్న గ్రామస్థులు
విజయనగరం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): విజయనగరానికి కూతవేటు దూరంలో ఉన్న కొండకరకాం కొండ అధికారపార్టీ నేతల మధ్య విభేదాలకు కారణమవుతుందా?.. అందుకే ఇక్కడ గ్రావెల్ తవ్వకాలను ఓ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారా?.. అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండకరకాం కొండ అక్రమాలకు కేరాఫ్‌గా మారింది. అప్పట్లో ప్రభుత్వానికి రూపాయి ఆదాయం లేకుండా కొండపై గ్రావెల్ తవ్వకాలు చేపట్టారు. జగనన్న కాలనీ లేఅవుట్ చదును పేరుతో కొండను ధ్వంసం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కొండపై తవ్వకాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కొండకరకాంలోని సర్వే నంబర్ 198లో రెండు క్వారీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అనుమతులు దక్కించుకున్న వారు కొండ వద్ద గ్రావెల్ తవ్వకానికి సిద్ధపడుతుండగా కొందరు అడ్డుపడుతున్నారు. వైసీపీ హయాంలో కళ్లెదుటే అక్రమాలు జరిగినా అడ్డుకోని వారు.. ఇప్పుడు మాత్రం అభ్యంతరాలు చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక రాజకీయ ఆధిపత్యం ఉందని, ముఖ్యంగా అధికారపార్టీ నేతల మధ్య విభేదాలతోనే క్వారీలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయనే ప్రచారం ఉంది. క్వారీలు దక్కించుకున్న ఇద్దరు ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరులుగా ప్రచారంలో ఉంది. అందుకే ఇంకో ప్రజాప్రతినిధి అడ్డు తగులుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి.
గ్రామస్థుల్లో ఆందోళన
ఇక్కడ క్వారీల నిర్వహణతో కొండపైన ఉన్న ఉమామహేశ్వర ఆలయ ఉనికికి ముప్పు వాటిల్లుతుందని, రూ.30 లక్షలతో ఆలయానికి వేసిన రోడ్డు ధ్వంసమవుతోందని కొండకరకాం గ్రామస్థులు చెబుతున్నారు. మరోవైపు క్వారీకి వెనుకభాగాన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందని.. గ్రామంలో ఎటువంటి చెరువులు లేకపోవడంతో కొండలోనే ఉపాధి పనులు చేస్తుంటామని చెబుతున్నారు. క్వారీ అనుమతులు రద్దుచేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం డిమాండ్ చేస్తున్నారు.