బొబ్బిలి కోటలో సందడి
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:14 AM
ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసిన విజేతలు, పార్టీ శ్రేణులతో సోమవారం బొబ్బిలి కోట కిటకిటలాడింది.
బొబ్బిలి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ప్రాదేశిక ఎన్నికల్లో విజయ బావుటా ఎగరేసిన విజేతలు, పార్టీ శ్రేణులతో సోమవారం బొబ్బిలి కోట కిటకిటలాడింది. బొబ్బిలి, బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల తరపున పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులతో పాటు వారి అనుచరులు, మద్దతుదారులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున చేరుకున్నారు. తమకు పార్టీ టికెట్ ఇచ్చి గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్ తెంటు లక్ష్ము నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. వారిని గజమాలతో సత్కరించారు. కోట ప్రాంగణమంతా పార్టీ శ్రేణుల జయజయనాదాలతో మార్మోగింది. అనంతరం బేబీనాయన, తెంటు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రభావమే ఈ ఘనవిజయమన్నారు. కూటమి అభ్యర్ధుల విజయానికి శ్రమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వానికి ఎక్కడా ఎటువంటి మచ్చ పడకుండా అందరూ ప్రజాసేవలో తరించాలని హితవు పలికారు. ఎప్పటికప్పుడు ప్రజాసమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.