Share News

A Hub for Illegal Activities..! అక్రమాలకు అడ్డాగా..!

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:33 AM

A Hub for Illegal Activities..! జిల్లాలో పలు సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు అక్ర మాలకు అడ్డాగా మారాయి. పైసలిస్తే చాలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏ పనైనా జరిగి పోతుందనే ఆరోపణలున్నాయి. మొత్తంగా దిగువ స్థాయి సిబ్బంది వైఖరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

A Hub for Illegal Activities..! అక్రమాలకు అడ్డాగా..!
సాలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

  • దిగువ స్థాయి సిబ్బంది చేతివాటం

  • సాలూరులో ఆ భూముల రిజిస్ర్టేషన్‌ అక్రమమా.. సక్రమమా?

  • విచారణ జరిగినా.. ఇంతవరకు చర్యల్లేవ్‌!

  • పాలకొండలోనూ ఇదే పరిస్థితి..

  • ఆ శాఖాధికారుల తీరుపై విమర్శల వెల్లువ

పార్వతీపురం, జూన్‌12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాలు అక్ర మాలకు అడ్డాగా మారాయి. పైసలిస్తే చాలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏ పనైనా జరిగి పోతుందనే ఆరోపణలున్నాయి. మొత్తంగా దిగువ స్థాయి సిబ్బంది వైఖరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలో సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం కేంద్రాలుగా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధానంగా సాలూరు, పాలకొండ కార్యాలయాలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది తమ ఉద్యోగ బాధ్యతలను విస్మరించి అక్రమార్కులకు అండగా నిలుస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. వారికి కొందరు రెవెన్యూ సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి స్టాంప్‌ డ్యూటీ రూపంలో ఎంత చెల్లిస్తారో అదే మొత్తంలో ముడుపులు రూపంలో చెల్లించుకోవాల్సిన పరిస్థితి జిల్లాలోని అనేక సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఉంది. దీంతో రిజిస్ర్టేషన్‌ శాఖపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాలూరు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో డగ్లస్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీకి చెందిన భూముల రిజిస్ర్టేషన్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరిగినా.. ఇంతవరకు ఎటువంటి చర్యల్లేవు. అంతా సక్రమమేని తేల్చేస్తారా? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వాస్తవంగా ఈ భూముల రిజిస్ర్టేషన్‌లో రెవెన్యూశాఖ కూడా పూర్తిస్థాయిలో సహకరించిందని, పెద్ద ఎత్తున సొమ్ములు చేతులు మారాయని పీజీఆర్‌ఎస్‌కు ఫిర్యాదులు అందాయి. దీనిపై జిల్లా రిజి స్ర్టార్‌ ఆధ్వరంలో విచారణ జరగ్గా.. ఆ భూములకు సంబంధించి భవిష్యత్‌లో రిజిస్ర్టేషన్‌ చేయవద్దని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాగా నివాస స్థలాన్ని వ్యవసాయ భూములుగా చూపించి రిజిస్ర్టేషన్‌ చేసినా.. ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోక పోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలో కొంతమంది పావులు కదుపుతూ.. దీనిని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక పాలకొండ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలోనూ అనేక అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. పట్టణంలో ఓ భూమి రిజిస్ర్టేషన్‌ గొడవలయ్యాయి. దీనిపై ఓ ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా జిల్లా రిజిస్ర్టేషన్‌ కార్యా లయాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Updated Date - Jun 13 , 2026 | 12:33 AM