వైభవంగా రథసప్తమి
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:41 AM
జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి.
-సూర్యనారాయణ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
విజయనగరం రూరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గజపతినగరం, రాజాం, సంతకవిటి, రేగిడి, గంట్యాడ, జామి, నెల్లిమర్ల, గుర్ల, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో రథసప్తమి వేడుకలు నిర్వహించారు. స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వేకువజామునే నీటిలో జిల్లెడు ఆకులు, రేగి పండ్లు వేసి స్నానాలు ఆచరించారు. ఇళ్ల ఎదుట మట్టిపొయ్యిని వెలిగించి పాలు పొంగించారు. అన్నం, బెల్లంతో ప్రసాదాన్ని తయారు చేసి స్వామివారికి సమర్పించారు. ఎర్రని పూలు పెట్టి, దీపం వెలిగించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరంలోని గుమ్చీ దాసన్నపేట రోడ్డులో ఉన్న పురాతన ఆలయంలో సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. బాబామెట్టలోని శివ పంచాయతన ఆలయంలో, నగర శివారులో ఉన్న రామనారాయణంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.