Share News

A glorious future awaits.భవిష్యత్‌ వైభోగమే

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:16 AM

A glorious future awaits. భోగాపురం.. మొన్నటి వరకు ఒక సాధారణ గ్రామం. పేరుకే మండల కేంద్రం. కొబ్బరి, జీడితోటలు.. చుట్టూ పచ్చని పంట పొలాలు, సముద్ర తీరంతో పెనవేసుకుని ఉంటుందని మాత్రమే తెలుసు.

A glorious future awaits.భవిష్యత్‌ వైభోగమే

భవిష్యత్‌ వైభోగమే

భోగాపురం ముఖ చిత్రంలో ఎన్నెన్నో మార్పులు

ఎయిర్‌పోర్టు ప్రారంభంతో మారనున్న రూపం

ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధానిగా మారే అవకాశం

రాబోయే పదేళ్లలో చుట్టూ నగరంలా విస్తరించే చాన్స్‌

పర్యాటక, రవాణా రంగాలకు కేరాఫ్‌

భోగాపురం.. మొన్నటి వరకు ఒక సాధారణ గ్రామం. పేరుకే మండల కేంద్రం. కొబ్బరి, జీడితోటలు.. చుట్టూ పచ్చని పంట పొలాలు, సముద్ర తీరంతో పెనవేసుకుని ఉంటుందని మాత్రమే తెలుసు. అంతర్జాతీయ విమానాశ్రయం రావడంతో మహర్దశ పట్టింది. అభివృద్ధికి మారుపేరుగా.. ఉత్తరాంధ్రకు ఆర్థిక రాజధానిగా... భవిష్యత్‌ మహానగరంగా... పర్యాటక, రవాణా రంగాలకు గ్రోత్‌ ఇంజన్‌గా మారనుందని సాధారణ వ్యక్తుల నుంచి నిపుణుల వరకూ అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర గర్వంగా చెప్పుకునేలా వెలుగులీనుతుందని, ఉపాధి కేంద్రంగా వర్థిల్లుతుందని ఆశిస్తున్నారు.

విజయనగరం, జూలై 30(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సాధారణ మండలంగా ఉన్న భోగాపురంలో ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. వరి, చెరకు ఎక్కువ పండిస్తారు. స్థానికంగా ఎటువంటి పరిశ్రమలు లేక యువత విశాఖ, హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. జాతీయ రహదారి వచ్చాక కొంత గుర్తింపు వచ్చింది. ఎయిర్‌పోర్టు రాకతో ఇక దశే మారనుంది. విభజన హామీల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాశ్ర యాన్ని కేటాయించింది. 2014లో మోదీ సర్కారు కొలువుదీరగా విజయనగరం ఎంపీగా ఉన్న పూసపాటి అశోక్‌గజపతిరాజు పౌర విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాష్ట్రానికి విమానాశ్రయం కేటాయించడంతో అశోక్‌ చొరవ, చంద్రబాబు ముందుచూపుతో భోగాపురం మండలాన్ని ఎయిర్‌పోర్టు కోసం ఎంపిక చేశారు. ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబే శంకుస్థాపన చేశారు. భూ సేకరణ తంతు కొంతవరకు సాగింది. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. భూ సేకరణ కొనసాగుతుండగానే 2023 మే 23న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి రెండోసారి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పనులు ఆగుతూ సాగాయి. ఐదేళ్లలో కేవలం 23 శాతం పనులే అయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ ఎయిర్‌పోర్టు నిర్మాణం పుంజుకుంది. రెండేళ్లలో 100 శాతం పనులు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక చొరవ... నిరంతర పర్యవేక్షణతో మరింత వేగంగా ఎయిర్‌పోర్టు సిద్ధమైంది.

తక్షణం వచ్చే మార్పులు..

విమానాశ్రయం ప్రారంభించిన తరువాత భోగాపురంలో సమూల మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టు ప్రారంభ సామర్థ్యం ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు కాగా భవిష్యత్‌లో 4 కోట్ల మందికి చేరుకునే అవకాశం ఉంది. మొదట్లో రోజుకు 3 వేల వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఒడిశా, చత్తీస్‌గడ్‌ల నుంచి అంతర్‌ రాష్ట్ర రహదారుల్లో వాహనాల రద్దీ పెరుగుతుంది. ముఖ్యంగా 16వ నంబరు జాతీయ రహదారిలో ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉంది. అటు విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఏడురోడ్ల కనెక్టవిటీ ఉంది. అదే సమయంలో విజయనగరం నుంచి గ్రామీణ రహదారులను సైతం అనుసంధానించనుండడంతో వాహనాల రద్దీ పెరగడమే కాదు ట్రాఫిక్‌ చిక్కులు పెరగొచ్చు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చిన మరుక్షణం 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. సెక్యూరిటీ, గ్రౌండ్‌, క్యాటరింగ్‌, కార్గో విభాగాల్లో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సమీప భవిష్యత్‌లో మూడు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. కేవలం పౌర విమానయానంలోనే కాదు.. పర్యాటకరంగం, పారిశ్రామిక, రవాణా రంగాల్లో కూడా ఉపాధి అవకాశం ఉంటుందంటున్నారు. 136 ఎకరాల్లో జీఎంఆర్‌-మాన్సాస్‌ ఏవియేషన్‌ ఎడ్యుకేషన్‌ సిటీ విమానాశ్రాయానికి అనుబంధంగా ఏర్పడనుంది. ఏడాదిలోపు ఈ ప్రాజెక్టు పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. పైలెట్లు, రక్షణరంగ నిపుణులు అందుబాటులోకి వస్తారు.

పదేళ్ల తరువాత..

రానున్న పదేళ్లలో అంటే 2036 నాటికి ఈ ప్రాంతం రూపురేఖలు మారే అవకాశం ఉంది. విమానాశ్రయం చుట్టూ ఒక నగరనమూనా ఆవిష్కృతం అవుతుంది. ప్రధానంగా పారిశ్రామిక కారిడార్‌ విస్తరిస్తుంది. ఎయిర్‌పోర్టులో కార్గో సౌకర్యం వల్ల సముద్ర ఆహార ఉత్పత్తులు, ఫార్మాతో పాటు ఎలక్ర్టానిక్స్‌ పరికరాల కంపెనీలు ఏర్పాటవుతాయి. విశాఖ-భోగాపురం మధ్య లాజిస్ర్టిక్‌ పార్కులు ఏర్పాటవుతాయి. ఏవియేషన్‌ యూనివర్సిటీ, హాస్పిటాలటీ కాలేజీలు, కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం వలస వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. తద్వారా జనాభాలో సైతం పెరుగుదల కనిపిస్తుంది. ఆ ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతుంది. భోగాపురం, నెల్లిమర్ల, డెంకాడ మండలాల చుట్టూ గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ క్యాంపస్‌లు వస్తాయంటున్నారు. ఇప్పటివరకూ విశాఖ శివారు ప్రాంతాలుగా తగరపువలస, భీమిలి ప్రాంతాలను చెప్పుకునేవారు. ఇక నుంచి ఆ జాబితాలోకి భోగాపురం చేరనుంది.

20 ఏళ్ల తరువాత..

రానున్న 20 ఏళ్లలో అంటే 2046 నాటికి భోగాపురం రూపురేఖలే మారిపోతాయి. ఇంటర్నేషనల్‌ హబ్‌గా మారేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ప్రయాణికులకు సంబంధించి ఏడాదికి 4 కోట్ల మందికి సామర్థ్యం పెరిగితే దక్షిణ భారతదేశంలో ప్రధాన కార్గో/ప్యాసింజర్‌ హబ్‌గా మారుతుంది. విశాఖ-భోగాపురం మెట్రో రైలు కనెక్టివిటీ సైతం కచ్చితంగా జరిగి తీరుతుంది. ఎయిర్‌పోర్టు చుట్టూ స్మార్ట్‌ సిటీ తరహాలో నివాసాలు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎక్స్‌పో సెంటర్లు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భోగాపురం ఒక నగరంగా అవతరిస్తుందన్న మాట. ఉత్తరాంధ్ర ఆర్థిక రాజధానిగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

హైదరాబాదు తరువాత భోగాపురమే

అంతర్జాతీయ విమానాశ్రయం రావడం జిల్లా ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నట్టే: భవిష్యత్తులో హైదరాబాదు తరువాత భోగాపురం విమానాశ్రయమే ఉంటుంది. అంతకు మించిన స్థాయికి వెళ్లినా ఆశ్చర్యపడనవసరం లేదు. టూరిస్ట్‌లు పెరుగుతారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా విదేశీ మారకద్రవ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. రానున్న ఐదేళ్లల్లో విజయనగరం తో పాటు జిల్లా ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.

- ఈఆర్‌ సోమయాజులు, సీనియర్‌ ఆడిటర్‌, విజయనగరం

---------------------

Updated Date - Jul 31 , 2026 | 12:16 AM