Share News

నిజరూపం దర్శనం.. భక్తజన పరవశం

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:29 AM

ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

నిజరూపం దర్శనం..  భక్తజన పరవశం
అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు, నిజరూప దర్శనం తరువాత బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న కోటదుర్గమ్మ

- కోటదుర్గమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

- అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

- క్యూలైన్లలో తప్పని అగచాట్లు

పాలకొండ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఈ భాగ్యం కలగడంతో భక్తజనం కనులారా కోటదుర్గమ్మను దర్శించి పులకించిపోయారు. జైజై దుర్గమ్మ అంటూ నామస్మరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8.30 గంటలకు ముహూర్తపురాట, కలశ స్థాపన చేశారు. ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. 8.30 గంటల తర్వాత అమ్మవారి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రూ.100, రూ.30, ఉచిత దర్శనం క్యూలైన్లు కిటకిటలాడాయి. నిజరూప దర్శనం తరువాత అమ్మవారిని బాలా త్రిపురసుందరీ దేవిగా అలంకరించారు.

భక్తులకు తప్పని అగచాట్లు..

అమ్మవారి నిజరూప దర్శనం కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ క్రమంలో పోలీసు, దేవదాయ ధర్మదాయశాఖ సిబ్బంది భక్తుల రద్దీని నియంతించలేకపోయారు. వీఐపీ దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర అగచాట్లకు గురయ్యారు. రూ.100, రూ.30, ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులు గంటల సేపు క్యూలైన్లలో వేచిఉండాల్సి వచ్చింది. సేవాదళ్‌ సేవల పేరుతో అధిక సంఖ్యలో పాసులను దేవదాయశాఖాధికారులు జారీ చేయడంతో మరింత గందరగోళం చోటుచేసుకుంది. కొందరు తమ కుటుంబ సభ్యులను ప్రత్యేక దర్శనాల కోసం తీసుకువచ్చి అత్యుత్సాహం చూపించారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారి నిజరూప దర్శనం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో నిజరూప దర్శనాన్ని కొనసాగించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్య క్రమానికి సుమారు ఆరు వేల మంది భక్తులు హాజరయ్యారని కమిటీ సభ్యులు తెలిపారు. సత్యసాయి సేవాసమితి, ఆర్యవైశ్య, కళింగ కోమట్ల సంఘం సభ్యులు భక్తులకు మజ్జిగ, గ్లూకోజ్‌ వాటర్‌, మంచినీటిని పంపిణీ చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ

అమ్మవారిని ఎస్పీ మాధవరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో వీవీ సూర్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీప్రసాదశర్మ ఎస్పీని ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లపై డీఎస్పీ రాంబాబు, సీఐ ప్రసాద్‌, ఎస్‌ఐ వెంకన్నను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవి, పల్లా కొండలరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Oct 12 , 2026 | 12:29 AM