స్నేహితుడే చంపేశాడు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:23 AM
తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడినే కర్రతో కొట్టి చంపేశాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, తరువాత హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.
- పారాది హత్యకేసును ఛేదించిన పోలీసులు
- కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఘాతుకం
- నిందితుడి అరెస్టు
బొబ్బిలి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశాడనే కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడినే కర్రతో కొట్టి చంపేశాడు. దీనిపై తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు, తరువాత హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను బొబ్బిలి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం డీఎస్పీ రాకోటి గోవిందరావు విలేకరులకు వెల్లడించారు. పారాది గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్, అదే గ్రామానికి చెందిన అల్లాడ పైడిరాజు స్నేహితులు. సంతోష్ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసి గ్రామానికి వచ్చేశాడు. పైడిరాజు ఇంజనీరింగ్ చదువుకొని స్థానిక గ్రోత్‌సెంటరు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ గ్రామ పొలిమేరల్లో రోజూ మద్యం సేవిస్తుంటారు. ఈ నెల 9న కూడా మద్యం తాగారు. కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పక్కన సంతోష్ మత్తులో పడి ఉన్నాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న పైడిరాజు కర్రబద్దితో సంతోష్ తలపై గట్టిగా కొట్టి చంపేశాడు. ఈ నెల 10న ఉదయం సంతోష్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే, సంతోష్ హత్యకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాద్యమాల్లో హల్‌చల్ చేసింది. ఎస్పీ ఆదేశాలతో సీఐ కింతలి నారాయణరావు, ఎస్‌ఐ డి.కొండలరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో హత్యగా తేలడంతో దర్యాప్తును ముమ్మరం చేశాం. క్లూస్‌టీమ్, డాగ్ స్వ్కాడ్‌ల ద్వారా అన్ని ఆఽధారాలను సేకరించారు. పైడిరాజే హత్యచేసినట్లు బలమైన ఆధారాలు లభ్యం కావడంతో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యక్తిగతంగా తనను, తన కుటుంబసభ్యులను కించపరిచినట్లు వ్యాఖ్యలు చేసినందుకే ఆగ్రహంతో సంతోష్‌ను చంపేసినట్లు పైడిరాజు అంగీకరించాడు. చనిపోయే ముందు ఆరు నిమిషాల పాటు ఫోన్‌లో సంభాషించినట్లు రుజువైందని డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ నారాయణరావు, ఎస్‌ఐ కొండలరావు పాల్గొన్నారు.