Share News

A former leader on wrong way ఓ మాజీ.. దందా!

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:16 AM

A former leader on wrong way ఆయన ఓ వైసీపీ నేత. తాజా మాజీ కార్పొరేటర్‌. కార్పొషన్‌లో అన్ని విభాగాలను శాసిస్తున్నాడు. కొందరు అధికారులు, సిబ్బంది ‘జీ హుజూర్‌’ అంటున్నారు. ఆయన ఆఫీసులోకి వస్తే.. లేచి నిలబడాల్సిందే! ఆయన నుంచి ఫోన్‌ వస్తే ఏపనైనా చేసి పెట్టాల్సిందే! ఆయన చెప్పి వారిని మారుమాటాడకుండా పనిలో పెట్టుకోవాల్సిందే! పనులకు బిల్లులు, టెండర్లు.. ఏవైనా సరే ఆయన చెప్పినట్లు చేయాల్సిందే! స్థలాలు కబ్జా చేసినా మారుమాటడకూడదు. ముఖ్య అధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే వారేలేరు.

A former leader on wrong way ఓ మాజీ.. దందా!
కార్పొరేషన్‌ కార్యాలయం

ఓ మాజీ.. దందా!

కార్పొరేషన్‌లో సంవత్సరాలుగా హవా

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా పైచేయి

ఆయన వెంటే ఇంకొందరు మాజీలు

నలిగిపోతున్న కార్పొరేషన్‌ ఉద్యోగులు

మళ్లీ తమదే అధికారం అంటూ హుకుం

విజయనగరం టౌన్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఆయన ఓ వైసీపీ నేత. తాజా మాజీ కార్పొరేటర్‌. కార్పొషన్‌లో అన్ని విభాగాలను శాసిస్తున్నాడు. కొందరు అధికారులు, సిబ్బంది ‘జీ హుజూర్‌’ అంటున్నారు. ఆయన ఆఫీసులోకి వస్తే.. లేచి నిలబడాల్సిందే! ఆయన నుంచి ఫోన్‌ వస్తే ఏపనైనా చేసి పెట్టాల్సిందే! ఆయన చెప్పి వారిని మారుమాటాడకుండా పనిలో పెట్టుకోవాల్సిందే! పనులకు బిల్లులు, టెండర్లు.. ఏవైనా సరే ఆయన చెప్పినట్లు చేయాల్సిందే! స్థలాలు కబ్జా చేసినా మారుమాటడకూడదు. ముఖ్య అధికారులు ఉన్న జిల్లా కేంద్రంలోనే ఈ దందా సాగుతున్నా పట్టించుకునే వారేలేరు.

కొన్ని ఉదాహరణలు

- నగరంలోని మేకల కబేళాకు వేలం వేయనీయకుండా ఆయన అధికారులను అడ్డుకుంటున్నారు. ఎదురుచెబితే హెచ్చరిస్తుండడంతో సిబ్బంది కిమ్మనడం లేదు. కార్పొరేషన్‌కు ఆదాయం రానీయడం లేదు కానీ ఆయన కనుసన్నల్లోనే కబేళా నడుస్తోంది.

- కార్పొరేషన్‌లోని ఇంజనీరింగ్‌ సెక్షన్‌ ద్వారా జరిగే అవుట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీలో తనకు నచ్చినవారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారం.

- క్యాంటీన్‌ నిర్వహణలో ఒకరికి అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పించడంతో పాటు

ఉద్యాన శాఖలోనూ ఒకరిని నియమించుకున్నట్లు వినికిడి.

- పాఠశాల మరమ్మతులకు నిబంధనలకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు. అసంపూర్తి పనులు చేసి బిల్లులు డ్రా చేసినట్లు స్థానికుల సమాచారం.

- మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ కాలనీలో స్థలాలను కబ్జా చేయించి అమ్మకాలు సాగించినట్లు విమర్శలు ఉన్నాయి.

- కార్పొరేషన్‌ కార్యాలయంలోని కొన్ని కీలక విభాగాల్లో తన వ్యక్తులను అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నియమించుకున్నట్లు సమాచారం.

- కార్పొరేషన్‌లో సాధారణ సమావేశాలు కూడా ఆయన చెప్పినట్లు జరిగేవి. మిగతా కమిటీ సభ్యులు ఆయన ఏం చెబితే దానికే తల ఊపి తీర్మానాలు చేసేవారన్న విమర్శ ఉంది.

ఆయనతో పాటు అదే పార్టీలో ఉన్న మరికొంతమంది మాజీలదీ అదే దారి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల హవా తగ్గకపోవడం గమనార్హం. ఇప్పటికీ ఉద్యోగులపైౖ వారి ఒత్తిడి కొనసాగుతూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నవారి కన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వారిమాటే చెల్లుబాటు అవుతోంది. దీనివల్ల కార్పొరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతన్నారు. సిబ్బందికి పనులు చెప్పడం.. ఆదేశాలు ఇవ్వడం.. హూంకరించడం జరుగుతోంది.

- నగరంలోని కలెక్టరేట్‌కు అతి సమీపంలో జాతీయరహదారిని ఆనుకుని ఉన్న రెండు డివిజన్లకు చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లకు సంబంధించి భర్తలే అన్నీ. అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్‌, సెటిల్‌మెంట్‌లలో హవా సాగించారు. కొళాయిల నుంచి కాలువల నిర్మాణం వరకూ ఇదే వరస. పదవీ కాలం ముగిసిన తరువాత కూడా తీరు మారలేదు. వారు ఉండే డివిజన్లలో భూములు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆప్రాంతంలో విశ్రాంత పోలీసులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ ఉద్యోగులు ఇళ్ల నిర్మాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు సాగించారు. ఆ సమయంలో నిర్మాణదారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. లేని లోపాలు చూపించి డబ్బులు డిమాండ్‌ చేసేవారని అంటున్నారు. తోటపాలెం, రింగురోడ్డు, ప్రదీప్‌నగర్‌, కామాక్షినగర్‌, పద్మావతినగర్‌, అయ్యప్పనగర్‌, పూల్‌భాగ్‌ వంటి పలు ప్రాంతాల్లో ఉన్న మాజీలు కూడా భవన నిర్మాణదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేసినట్లు తెలిసింది.

మళ్లీ అధికారంలోకి వస్తామంటూ..

నూతన పాలకవర్గం వచ్చేంత వరకూ తమదే అధికారం అంటూ హల్‌చల్‌ చేస్తున్నారు. కార్పొరేషన్‌లో జరిగే ప్రతీ కార్యక్రమం తమ కనుసన్నల్లో జరగాలంటూ ఆయా విభాగాల అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తామే మళ్లీ అధికారంలోకి వస్తామని, మాట వినకపోతే అధికారంలోకి వచ్చిన తరువాత చూస్తామంటూ ఉద్యోగులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇదంతా అధికార పార్టీ నేతలకు తెలిసినప్పటికీ కొన్ని డివిజన్లలో మాజీలతో కలిసిపోవడం, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తే పట్టించుకోనప్పుడు మనకెందుకులే అంటూ మౌనం పాటిస్తున్నారన్నది స్థానికుల మాట.

Updated Date - Jul 16 , 2026 | 12:16 AM